హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద జీవో 111 ఉల్లంఘనలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రం ఎలా విఫలమైందని ప్రశ్నిచింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ అక్రమ నిర్మాణాలపై మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మందడి మాధవ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 1996 నాటి ప్రభుత్వ ఉత్తర్వు జీవో 111 కింద రక్షించబడిన ప్రాంతాలలో అనధికార నిర్మాణాలను అరికట్టడంలో సంబంధిత విభాగాలు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ALSO READ: ప్రపంచ టాప్ 35 నగరాల్లో హైదరాబాద్!
దీంతో ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుక యారాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా తమ స్పందనలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను ఆదేశించింది. ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల అండ్ సీఏడీ శాఖ, ఎంఏయూడీ శాఖ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, వాటర్ బోర్డ్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీతో సహా ఇతర అధికారులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ప్రతివాదులకు కూడా నోటీసులు అందాయి. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలు జంట జలాశయాల పరివాహక ప్రాంతాల నుంచి 10 కి.మీ. పరిధిలోకి వస్తాయి. ఇవి హైదరాబాద్ నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయి కోర్టు పేర్కొంది.
అందుకే..హైదరాబాద్‌లో నీటి కొరత
జీవ సంరక్షణ జోన్‌లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పర్యావరణ (రక్షణ) చట్టం, 1986, జల (కాలుష్య నివారణ & నియంత్రణ) చట్టం, 1974 జాతీయ హరిత ట్రిబ్యునల్, భారత సుప్రీంకోర్టు న్యాయపరమైన తీర్పులను ఉల్లంఘించారంటూ మాధవ రెడ్డి తన పిటిషన్‌లో వాదించారు. నియంత్రణ లేని నిర్మాణాలు సహజ నీటి మార్గాలను అడ్డుకుంటున్నాయని, తద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలోకి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల నీటి మట్టాలు తగ్గడం, నీటి నాణ్యత క్షీణించడమే కాకుండా హైదరాబాద్‌లో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని చెప్పారు.
జలాశయాల నుంచి బలవంతంగా విడుదల చేస్తున్న వరద హైదరాబాద్‌లో పట్టణాలు మునిగేందుకు దారితీస్తుందని వివరించారు. జీవో 111ని అమలు చేయాలని, జీవోకు అనుబంధంగా జాబితా చేయబడిన రక్షిత గ్రామాల్లో అన్ని నిర్మాణ కార్యకలాపాలను నిషేధించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మాధవ రెడ్డి కోర్టును కోరారు.