Categories: TOP STORIES

వానాకాలంలో ఇంటి జాగ్రత్తలివే..

కాస్త లేటుగా అయినా రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చాయి. అడపాదడపా వానలు కురవడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వల్ల మన ఇంటికి ఎలాంటి సమస్యా రాకుండా ఉండేందుకు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూసుకోవడంతోపాటు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే వానాకాలాన్ని హ్యాపీగా గడిపేయొచ్చు. మరి అవేంటో చూద్దామా?

వర్షాకాలంలో వెచ్చని, తేమతో కూడిన వాతావరణం కీటకాలు, ఇతరత్రా జీవులకు అనుకూలమైనది. అందువల్ల కీటకాల, ఇతర విషపూరిత జీవులు మీ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కీటకాల వల్ల ఎలాంటి హానీ లేకపోయినా.. అవి ఫర్నిచర్, గోడలను నాశనం చేయడంతోపాటు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. అందువల్ల ఎక్కడా నీటి నిల్వ ఉండకుండా చూసుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు ఇళ్లలోకి దోమలు రాకుండా అన్ని కిటికీటు, తలుపులకు దోమతెరలను అమర్చండి.
ఇక చెదపురుగులు ఫర్నిచర్ ను నాశనం చేస్తాయి. వీటిని నివారించేందుకు ఫర్నిచర్ కు యాంటీ టర్మైట్ కోటింగ్ వేయించండి.
ఇక వర్షాకాలంలో ఎదురయ్యే పెద్ద సమస్య.. లీకేజీ. గోడలు లేదా పైకప్పు నుంచి ఏమైనా లీకేజీలు ఉన్నాయేమో పరిశీలించండి. ఆలస్యం చేసే కొద్దీ దాని మరమ్మతులకు పెట్టాల్సిన ఖర్చు పెరుగుతుందని గుర్తుంచుకోండి. అందువల్ల సీలింగ్, గోడలకు సీలెంట్ లేదా పుట్టీతో డ్యాంప్ ప్రూఫ్ చేయించండి. బయటి గోడలపై వాటర్ ప్రూఫింగ్ ఏర్పాటు చేయించింది. లోపలి గోడలకు సిలికాన్ పెయింట్స్ ఎంచుకుంటే సరిపోతుంది.
ఏడాది పొడవునా ఇంటికి వెంటిలేషన్ తప్పనిసరి. వర్షాకాలంలో ఇంటి లోపల గాలి తేమగా ఉంటుంది కాబట్టి ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ వెంటిలేషన్ ఏర్పాటు చేసుకుంటే తేమ స్థాయి అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా దుర్వాసన ఉంటే తొలగిస్తుంది. అందువల్ కిటికీలు తెరిచి లోపలకు సాధ్యమైనంత ఎక్కువ గాలి వచ్చేలా చూసుకోండి.
వర్షాకాలంలో విద్యుత్ షార్ట్ సర్కూట్లకు అవకాశం ఎక్కువ. అందువల్ వానాకాలం ప్రారంభం కావడానికి ముందుగానే నిపుణుడైన ఎలక్ట్రీషియన్ తో వైరింగ్ , స్విచ్ బోర్డులు, మెయిన్ వంటి వాటిని తనిఖీ చేయించడం మంచిది.
మీ ఇంటి కిటికీలు, తలుపులు చెక్ చేసి ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో పరిశీలించండి. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే డ్యాంప్ ప్రూఫ్ చేయించండి.

మీ ఔట్ డోర్ లో ఏర్పాటు చేసుకున్న సీటింగ్ ను పరిశీలించండి. తడిచినా పాడవని సీట్లు అయితే పర్లేదు.. లేకుంటే వాటిని మార్చండి.

డోర్ల వద్ద నాన్ స్కిడ్ మ్యాట్ లు మాత్రమే వినియోగించండి.
తలుపులు, కిటికీలకు భారీ కర్టెన్లు వాడొద్దు. పలుచని కాటన్ కర్టెన్లు వానాకాలానికి అనువుగా ఉంటాయి.
వర్షాకాలంలో ఫ్లోర్ పై రగ్గులు, కార్పెట్లు వాడొద్దు. వీటి వల్ల బూజు, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది.
అలాగే లెదర్ వస్తువులు కూడా కొనకండి. వర్షాకాలంలో అవి పాడయ్యే అవకాశం ఉంటుంది.
మీ ఇంట్లో లెదర్ సోఫాలు ఉంటే.. వాటికి కవర్లు వేయండి.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలం ఎలాంటి చీకూచింతా లేకుండా కులాసాగా ఎంజాయ్ చేయొచ్చు.

This website uses cookies.