Categories: TOP STORIES

దేశ రాజధానిలో రెట్టింపైన ఇళ్ల ధరలు

2019 తర్వాత సగటు ధరల్లో భారీ వృద్ధి

ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి

దేశ రాజధాని ఢిల్లీ రియల్ రంగంలో దూసుకెళ్తోంది. గురుగ్రామ్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌ (ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతం) పరిధిలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో గత ఐదేళ్ల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లోని ఇళ్ల ధరలు సగటున రెట్టింపైనట్టు రియల్‌ ఎస్టేట్‌ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది. 2019 నుంచి 2024 సెప్టెంబర్‌ మధ్య కాలంలో నోయిడాలో అత్యధికంగా చదరపు అడుగు ధర 152 శాతం మేర పెరిగి రూ.5,910 నుంచి రూ.14,946కు చేరింది.

ఘజియాబాద్‌లో 139 శాతం పెరిగి రూ.3,691 నుంచి రూ.8,823కు చేరింది. గురుగ్రామ్‌లో చదరపు అడుగు ధర రూ.19,535కు చేరగా.. గ్రేటర్‌ నోయిడాలో చదరపు అడుగు ధర 121 శాతం పెరిగి రూ.8,601గా ఉంది. 2019లో ఇక్కడ చదరపు అడుగు రేటు రూ.3,900గా ఉంది. ‘‘ఎన్‌సీఆర్‌ ప్రాంతం ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధిని చూస్తోంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, ద్వారకా ఎక్స్ ప్రెస్‌ వే, ఢిల్లీ-మీరట్‌ ఎక్స్ ప్రెస్‌ వే, ర్యాపిడ్‌ రైల్‌, మెట్రో విస్తరణ అన్ని రకాలుగా రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదపడుతున్నాయి’’అని ప్రాప్‌ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ జసూజా తెలిపారు.

This website uses cookies.