వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిర అవుతున్న మన దేశ రాజధాని ఢిల్లీయే భారత్ అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్ గా నిలిచింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో అత్యంత ఖరీదైన ఆఫీసు స్పేస్ అద్దె మార్కెట్ కలిగిన నగరాల్లో ఢిల్లీ- ఎస్‌సీఆర్ ఆరో స్థానంలో ఉందని ప్రాపర్టీ సర్వీసెస్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మన ఆర్థిక రాజధాని ముంబై ఎనిమిదో స్థానంలో ఉండగా.. బెంగళూరు నగరం 18వ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. హాంగ్‌కాంగ్ నగరం వరుసగా మూడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది. నెలవారీగా ప్రధాన మార్కెట్ చదరపు అడుగు సగటు అద్దె ఢిల్లీలో రూ.340 ఉండగా, ముంబైలో రూ.317, బెంగళూరులో రూ.138గా ఉంది.
వార్షిక ప్రాతిపదికన 2024 క్యూ3లో ఢిల్లీలో ప్రధాన మార్కెట్ అద్దెలు స్థిరంగా ఉన్నాయి. అయితే కార్పొరేట్ల నుంచి బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ, సరఫరా తక్కువగా ఉండటంతో ప్రధాన మార్కెట్లలో అద్దెలు ముంబైలో 5 శాతం, బెంగళూరు 3 శాతం మేర వృద్ధి చెందాయి. వృద్ధి పథంలో పయనిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ను ఆకర్షిస్తోందని, దేశీయ ప్రధాన ఆఫీసు మార్కెట్ డిమాండ్ స్థిరంగా కొనసాగడం ఇందుకు నిదర్శనమని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.
This website uses cookies.