నగర శివార్లలో ఏర్పాటుకు సర్కారు యోచన
ఔటర్-ఆర్ఆర్ఆర్ మధ్య అనువైన ప్రాంతాల్ని
గుర్తించాలని అధికారులకు భట్టి ఆదేశం
మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీల తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం నగర శివార్లలో అనువైన స్థలాలను అన్వేషించాలని అధికారులకు సూచించింది. ఔటర్ రింగురోడ్డు, రీజనల్ రింగు రోడ్డు మధ్యలో వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేయాలని ఇటీవల జరిపిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
కేపీహెచ్‌బీ, మౌలాలి, ఈసీఐఎల్, ఎస్సార్‌నగర్, బర్కత్‌పుర వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో హౌసింగ్ కాలనీలను నిర్మించిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల క్రితం ఆ తరహా నిర్మాణాలకు స్వస్తి పలికారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గృహ నిర్మాణ మండలి స్తబ్దుగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించనున్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలకు నీడ కల్పించటంతోపాటు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయాల్సిన బాధ్యత గృహనిర్మాణ శాఖపై ఉందని పేర్కొన్న భట్టి.
గతంలో హౌసింగ్‌బోర్డు కాలనీల నిర్మాణంతో ఎంతోమందికి లబ్ధి కలిగిందని గుర్తు చేశారు. కొత్తగా నిర్మించబోయే రీజినల్ రింగు రోడ్డు, ఔటర్ రింగురోడ్డు మధ్య ఈ కాలనీల నిర్మాణానికి భూమిని సేకరించాలని ఆదేశించారు. కాలనీల నిర్మాణం, కావాల్సిన భూమి తదితర వివరాలతో రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సౌర విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో చేపట్టబోయే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణం, వాటి నమూనాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాల్లో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.
ముంబై, చెన్నై, బెంగుళూరు నగరాల్లో అధ్యయనం చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై భట్టి ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా 69 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, 65 వేల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామని చెప్పారు.