ఈ వేసవిలో చాలాచోట్ల నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. నిజానికి వేసవి మొదలుకాక ముందే పలుబచోట్ల నీటి ఎద్దడి నెలకొంది. బెంగళూరులో అయితే చెప్పనక్కర్లేదు. అక్కడ నీటి సమస్య మామూలుగా లేదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ టౌన్ ఆప్షన్ ఇచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి వేసవిలోనూ వచ్చే ఈ నీటి సమస్యను ఎదుర్కొనేదెలా? అంటే చాలా సింపుల్ అంటున్నారు నిపుణులు.
ఏటా వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూమిలోకి ఇంకేలా చేస్తే చాలు.. బోర్లు ఎండిపోవని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంతా కాంక్రీట్ జంగిల్ లా మారిపోవడంతో వర్షపు నీరు ఇంకే మార్గం లేక ఆ నీరంతా వృథాగా పోతోంది. ఎక్కడా భూమిలోకి ఇంకే ఏర్పాటు లేకపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఫలితంగా బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి రాకుండా నివారించేందుకు ఇంటికి ఇంకుడుగుంత బాగా ఉపకరిస్తుందని, కొత్తగా ఇల్లు కట్టుకునే వారితో పాటు, ఇప్పటికే ఇల్లున్నవారి దీని ప్రాధాన్యం గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇంట్లో అయితే, కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో కనీసం ఏడు నుంచి పది అడుగుల లోతులో గుంత తీయాలి. అందులో కొంత భాగం వరకు పెద్ద రాళ్లు, ఆపై మరికొంత భాగం కంకర, ఆపై దొడ్డు ఇసుక వేయాలి.
చెత్తాచెదారం అందులోకి చేరకుండా పైన మెష్ ఏర్పాటు చేయాలి. అనంతరం వర్షపు నీరు అందులోకి పారేలా ఏర్పాటు చేయాలి. అంతే.. వర్షపు నీరు ఆ గుంతలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయి. ఫలితంగా బోరు ఎండిపోదు. అదే కాలనీలో అయితే, ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ లో కాస్త పెద్ద గుంత ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మరి మీరు కూడా ఈ వేసవిలో ఆ పని పూర్తి చేస్తే.. తదుపరి వేసవికి నీటి కష్టాల్లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు.
This website uses cookies.