- ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు టీఎస్ఎండీసీ పోర్టల్
- రియల్ టైమ్ లో ట్రాక్ చేసుకునే వెసులుబాటు
ఇసుక విక్రయాల్లో అక్రమాలను నిరోధించడానికి, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లోనే కూర్చుని ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. కంపెనీలతోపాటు ప్రైవేటు సంస్థలు, కస్టమర్లు ఎవరైనా సరే సులభంగా ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోవడంతోపాటు రియల్ టైమ్ లో ట్రాక్ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) శాండ్ సేల్ మేనేజ్ మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్(ఎస్ఎస్ఎంఎంఎస్) వ్యవస్థను తీసుకొచ్చింది. ఆన్ లైన్ పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇకపై నేరుగా ఇసుక ఆర్డర్ చేసుకోవడానికి కుదరదు. మంత్రి కేటీఆర్ శుక్రవారం టీఎస్ఎండీసీ (tsmdc.telangana.gov.in) వెబ్‌సైటును ఆవిష్కరించారు.
పోర్టల్ ఫీచర్లవీ..
* పోర్టల్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చాలా సులభం. ఇందుకోసం పెద్ద పెద్ద ఫారంలు పూర్తి చేయనక్కర్లేదు. * మీ ఆర్డర్ స్టేటస్ ఏమిటనేది ఆన్ లైన్ లోనే ట్రాక్ చేసుకోవచ్చు
* ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఇసుక రవాణా అనుమతికి చార్జీలు కూడా తక్కువే.
* కస్టమర్ల సందేహాలకు త్వరితగతిన జవాబులు ఇచ్చే అవకాశం. ఇందుకోసం టికెట్ రైజ్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది.
* రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యత ఎంత ఉందనే వివరాలు ఎప్పటికప్పుడు పోర్టల్ చూసి తెలుసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఇలా..
ఆన్ లైన్ పోర్టల్ లో ఇసుక బుక్ చేసుకోవడం కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం కింద పేర్కొన్న పత్రాలు అవసరమవుతాయి.
అధికారిక పనులు (ఇసుక కోసం)
* ఆఫీషియల్ లెటర్
* వర్క్ ఆఫర్ లేదా అగ్రిమెంట్ కాపీ
* కాపీ ఆఫ్ ఎస్టిమేషన్
ప్రైవేటు పనులు (ఇసుక కోసం)
* బిల్లింగ్ ప్లాన్ అనుమతి పత్రం కాపీ
* ఐడీ ప్రూఫ్
* కంపెనీ లెటర్ హెడ్ పై దరఖాస్తు
ఇసుక బుకింగ్ ఎలా చేసుకోవాలంటే..
* తొలుత sand.telengana.gov.in సైట్ లోకి వెళ్లి మెనులో ‘రిజిస్ట్రేషన్’ బటన్ క్లిక్ చేసి ‘కస్టమర్ రిజిస్ట్రేషన్’ సెలక్ట్ చేయాలి.
* అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
* ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో మీ వివరాలు నమోదు చేయాలి.
* రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ sand.telengana.gov.in సైట్ లోకి వెళ్లి మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ కావాలి.
* అనంతరం మీ జిల్లాను సెలక్ట్ చేసుకుని స్టాక్ యార్డ్ ఎంచుకోవాలి.
* అక్కడ వివరాలు నమోదు చేసి ‘రిజిస్టర్’ సెలక్ట్ చేయాలి. అనంతరం ‘ఓకే’ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు బుకింగ్ నంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి.
* పేమెంట్ పూర్తిచేసిన తర్వాత ‘గెట్ రిసీప్ట్’ బటన్ క్లిక్ చేసి రసీదు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
* ఇసుక బుకింగ్ పూర్తయిన తర్వాత దాని స్థితి ఎలా ఉందనేది ఈ పోర్టల్ లోనే తెలుసుకోవచ్చు.
* sand.telengana.gove.in సైట్ లోకి వెళ్లి ‘ట్రాకింగ్’ అనే ట్యాబ్ సెలక్ట్ చేసి, ‘ట్రాక్ యువర్ ఆర్డర్’ క్లిక్ చేయాలి. అక్కడ ఆర్డర్ ఐడీ నమోదు చేసి ‘గెట్ స్టేటస్’ బటన్ క్లిక్ చేయాలి.
* మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ ఆర్డర్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాన్ని కూడా ఈ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు. sand.telengana.gove.in సైట్ లోకి వెళ్లి ‘రిజిస్ట్రేషన్’ ట్యాబ్ లో ఉన్న ‘వెహికల్ రిజిస్ట్రేషన్’ బటన్ క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్, వాహనం నంబర్, ఆర్ సీ వివరాలు, ఇంటి చిరునామా, ఇంజిన్ నెంబర్ తదితరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారు మొబైల్ కి రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. మీ వాహనం రిజిస్టర్ అయిందో లేదో పోర్టల్ లో కూడా చూసి తెలుసుకోవచ్చు. ఇక పోర్టల్ కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 040-233323150 నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.