హైడ్రా కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో.. సొంతింటి కలను సాకారం చేసుకునే ఇంటి కొనుగోలుదారులు.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, డీటీసీపీ వంటి సంస్థలు అనుమతులు చాలా ప్రధానమైనవి. ఇక ఇప్పుడు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని స్థిరాస్తులను కొనుగోలు చేయడం మరీ ముఖ్యం. అయితే చాలా మంది అనుమతులు అన్నీ ఉన్నాయని మధ్యవర్తులు చెప్పిన వెంటనే గుడ్డిగా నమ్మేసి మోసపోతున్నారు. ఇలా కొన్న ఆస్తి చేతికి రాకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఇల్లు లేదా ఇంటి స్థలం కొనే సమయంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల గురించి తెలుసుకోవాలి.
మనం కొనాలనుకుంటున్న ఇల్లు లేదా ఇంటి స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కు చాలా కీలకం. అది ఎవరి పేరుతో ఉంది.. వారసులు ఎవరు.. ఆ ఇంటి స్థలం లేదా ఇంటిపై ఇది వరకు న్యాయపరమైన కేసులు ఉన్నాయా.. దాన్ని అమ్మే వ్యక్తి వద్ద ఉన్న పత్రాలు నిజమైనవేనా.. వంటి అంశాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి.
తెలిసిన వారు చెప్పారననీ, బంధువులు సూచించారనీ గుడ్డిగా నమ్మకుండా.. టైటిల్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఆ సర్వే నంబరుతో తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి టైటిల్ పరిస్థితి తెలుసుకోవాలి. ఐదు, పది వేలు ఖర్చయినా ఫర్వాలేదనుకుని.. న్యాయ నిపుణుల్ని సంప్రదించాలి.
ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలి. ఆస్తి అమ్మే వ్యక్తి స్వార్జితమా..వారసత్వంగా వచ్చిందా…వారసులు ఉన్నారా వంటి వివరాలు తెలుసుకుని.. వారసులు ఉంటే వారి సంతకాలు తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే అడ్వాన్సు ఇచ్చి రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకోవాలి.
హైదరాబాద్ లో లేక్ వ్యూ వద్ద ప్లాట్లు, ఫ్లాట్లు అంటూ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఊరిస్తున్నాయి. లేక్ వ్యూ పేరు చెప్పి ప్రీమియం ధరలకు ఇల్లు, ఇంటి స్థలాల్ని విక్రయిస్తున్నారు. లేక్ వ్యూ ప్రాజెక్టుల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే సమయంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కు సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చెరువులు, నీటి వనరుల సమీపంలోని స్థిరాస్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం గ్రేటర్ సిటీలో ఇరిగేషన్ శాఖ జారీ చేసిన ఎన్‌వోసీతో హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల విషయంలో కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు ఉన్నా.. న్యాయ నిపుణులను సంప్రదించి మరోసారి చెక్ చేసుకోవాలి.
హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థిరాస్తి అయితే మాస్టర్ ప్లాన్-2030 లో మీరు కొనే ఇల్లు లేదా ఇంటి స్థలం ఏ జోన్ లో ఉందో చెక్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ జోన్ మినహా.. మరే జోన్లో ఉన్నా అక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయవద్దు. ముఖ్యంగా చెరువు సమీపంలో మీ ఆస్తి ఉంటే మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.
రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మీ స్థిరాస్తికి సంబంధించిన సర్వే నంబరు ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదా తెలుసుకోవాలి. హెచ్‌ఎండీఏకు చెందిన
https://lakes.hmda.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి.. అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకొని మీ సర్వే నంబరు ఆధారంగా ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు.
ఎఫ్‌టీఎల్ కాలమ్‌లో క్లిక్ అని బ్లూ కలర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఎఫ్‌టీఎల్ వరకు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది.. పరిసరాల్లో ఏం ఉన్నాయో కూడా కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ కు వచ్చి క్యాడస్ట్రల్ మీద క్లిక్ చేస్తే మళ్లీ మ్యాపు ఓపెన్ అవుతుంది. దీంతో ఆ చెరువు ఏయే సర్వే నంబర్ల పరిధిలో ఉందో తెలుస్తుంది. మ్యాప్ లో నీలి రంగు లైన్‌తో ఉన్నది ఎఫ్‌టీఎల్ పరిధి.. దాని పక్కనే రెడ్ కలర్‌తో ఉన్నదే బఫర్ జోన్. చెరువు కట్ట ఆరెంజ్ కలర్‌తో ఉంటుంది. దాని ప్రకారం చెరువుకు ఎటువైపు మీ ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్ మెంట్ ఉందో చెక్ చేసుకోవచ్చు.