భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ లీజింగ్ లో భారీ వృద్ధి నమోదైందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసులు, పెట్టుబడుల సంస్థ సీబీఆర్ఈ గ్రూప్ పేర్కొంది. త్రైమాసికాలవారీగా చూస్తే 40 శాతం, వార్షికంగా చూస్తే 18 శాతం పెరుగుదల నమోదైనట్టు వివరించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, లీజింగు లో డిమాండ్ ఉండటంతో ఈ మేరకు వృద్ధి నమోదైందని తెలిపింది.
‘ఇండియా మార్కెట్ మానిటర్-క్యూ3, 2022’ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ‘2022 మొదటి తొమ్మిది నెలల్లో గతేడాది ఇదే కాలవ్యవధి కంటే 18 శాతం అధికంగా లీజు కార్యకలాపాలు సాగాయి. ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది’ అని నివేదిక అంచనా వేసింది. మొత్తమ్మీద 2022లో లీజింగ్ కార్యకలాపాలు 28 నుంచి 32 మిలియన్ చదరపు అడుగుల మేర జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై కలిపి 57 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపింది. 2022 తొమ్మిది నెలల్లో 22 మిలియన్ చదరపు అడుగుల మేర లీజింగ్ కార్యకలాపాలు జరగ్గా.. 13 మిలియన్ చదరపు అడుగుల మేర అదనపు సరఫరా నమోదైందని నివేదిక వెల్లడించింది. రాబోయే త్రైమాసికాల్లో అదనపు సరఫరా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 3పీఎల్ (50 శాతం), ఇంజనీరింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (17 శాతం), రిటైల్ (9 శాతం), ఈ-కామర్స్ (7 శాతం), ఎఫ్ఎంసీజీ (4 శాతం) లీజింగ్ కార్యకలాపాలు కొనసాగించాయి. అదనపు సరఫరా విషయానికొస్తే 2022 క్యూ3లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కలిసి 68 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతాలో అద్దెలు పెరిగాయి.
This website uses cookies.