Categories: LATEST UPDATES

ఇండోర్ లో తొలి పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో దేశంలోనే తొలి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇండోర్ లో ఏర్పాటైంది. దీని ద్వారా పర్యావరణ స్థిరత్వం వైపు ఇండోర్ అడుగులు వేస్తోంది. నగరంలో హరిత వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడం ద్వారా వ్యర్థ నిర్వహణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ గ్రీన్ వేస్ట్ ను ప్రాసెస్ చేయడమే కాకుండా ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. కలప తదితరాలను సరఫరా చేయడం ద్వారా టన్నుకు దాదాపు రూ.3వేల రాయల్టీని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పొందుతోంది. బిచోలి హాప్సీలోని 55వేల అడుగుల భూమిలో నిర్మించిన ఈ ప్లాంట్.. కలప, చెట్టు కొమ్మలను రీసైకిల్ చేసి ఉడెన్ పెల్లెట్స్ తయారుచేస్తుంది. ఇవి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.

నగరంలోని పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ కు మళ్లిస్తారు. అలాగే ఇండోర్ లోని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న ప్రదేశాల్లో ఉత్పత్తి అయ్యే హరిత వ్యర్థాలను సైతం సేకరించి ప్లాంట్ కు పంపిస్తారు. వాటిని అక్కడ నామమాత్రపు రుసుముతో రీసైకిల్ చేస్తారు. ప్రతిరోజూ సందడిగా ఉండే ఇండోర్ లో రోజుకు 30 టన్నుల హరిత వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. శరదృతువులో ఈ పరిమాణం 60 నుంచి 70 టన్నులకు పెరుగుతుంది. అలాగే రంపపు దుమ్మును పర్యావరణ అనుకూల ఇంధనంగా మారుస్తారు. సాంప్రదాయ దహన పద్ధతులకు ప్రత్యామ్నాయాన్ని ఇది అందిస్తుంది. ప్లాస్టిక్ అవసరాన్ని తగ్గించే మన్నికైన ప్యాకింగ్ పదార్థాలను తయారు చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఫర్నిచర్ తయారీదారులు దీనిని మిశ్రమ పదార్థంగా ఉపయోగకరంగా భావిస్తారు.

This website uses cookies.