Categories: TOP STORIES

జీసీసీ హబ్ గా హైదరాబాద్

ఐదేళ్లలో భారత్ కి వచ్చిన జీసీసీల్లో 30 శాతం భాగ్యనగరంలోనే ఏర్పాటు

నాస్కామ్ వెల్లడి

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) హబ్ గా హైదరాబాద్ అవతరిస్తోంది. గత ఐదేళ్లలో దేశంలో ఏర్పాటైన మొత్తం జీసీసీల్లో 30 శాతం మన భాగ్యనగరంలోకే వచ్చాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లు సైతం జీసీసీలను ఆకర్షించేందుకు గట్టిగా పోటీ పడుతున్నప్పటికీ, హైదరాబాద్ హవా కొనసాగుతోంది. గడిచిన ఐదేళ్లలో భారత్‌లో 1,700 జీసీసీలు, 2,975 జీసీసీ యూనిట్లు ఏర్పాటు కాగా, వీటిలో 30 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2019లో హైదరాబాద్‌లో 230 జీసీసీలు ఉండగా 2024 నాటికి వీటి సంఖ్య 355 చేరింది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్‌ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి జీసీసీ కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు.

ఈ విషయాలను ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్ వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీ’(నాస్కామ్‌) వెల్లడించింది. తెలంగాణలో జీసీసీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ ఇటీవల ‘జీసీసీ తెలంగాణ ప్లే బుక్‌’ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్‌ వాతావరణం వేగంగా వృద్ధి చెందుతుండటం జీసీసీల ఏర్పాటుకు ఊతమిస్తోందని తెలిపింది. భూమి కొనుగోలుపై రాయితీ, ఐటీ పార్క్‌ ప్రోత్సాహకాలు, స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు, విద్యుత్‌ రాయితీ వంటివి కూడా జీసీసీలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయని వివరించింది. టాస్క్‌, స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా ఏటా వేలాది మందికి నైపుణ్య శిక్షణ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఎస్‌బీ వంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉండటం జీసీసీ ఏర్పాటుకు అనుకూలమైన అంశాలని పేర్కొంది.

అలాగే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 40 లక్షల నుంచి 60 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వస్తుందని.. ఇది కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలమైన అంశమని తెలిపింది. కాగా, తెలంగాణలో ఏర్పాటవుతున్న జీసీసీలు కొన్ని ప్రధాన రంగాల్లో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. సాఫ్ట్ వేర్‌/ఇంటర్‌నెట్‌, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, సెమీకండక్టర్‌, ఫార్మాస్యూటికల్స్‌, రిటైల్‌, మెడికల్‌ డివైజెస్‌, టెలి కమ్యూనికేషన్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటోమోటివ్‌, వృత్తిపరమైన సేవల రంగాల్లో జీసీసీల ఏర్పాటుకు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో ఏర్పాటైన జీసీసీలన్నీ హైదరాబాద్‌లో.. ప్రత్యేకించి గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండలోనే కేంద్రీకృతమయ్యాయి. ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ జీసీసీల ఏర్పాటుకు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నట్లు నాస్కామ్‌ ప్రకటించింది.

This website uses cookies.