హైదరాబాద్ కాస్ట్‌లీ సిటీగా మారింది. దేశంలో అత్యంత ఖరీదైన ఇళ్లలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌కు చేరింది. చదరపు అడుగు ధర రూ.9,600–9,800తో ముంబై తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్‌లో రూ.5,800 నుంచి 6,000లుగా ఉన్నాయని ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్.కామ్ తెలిపింది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్ మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశంలోని ప్రధాన నివాస విభాగ మార్కెట్లలో ధరల వృద్ధిని విశ్లేషించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే 2021 మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో చ.అ. ధర 3 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతమిక్కడ చ.అ.కు సగటు ధర రూ.5,751గా ఉంది. అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్‌గా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో నిలిచింది. ఇక్కడ చ.అ. సగటు ధర రూ.9,670గా ఉంది. ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో 7,812 గృహాలు విక్రయమయ్యాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 222 శాతం, గతేడాది క్యూ3తో పోలిస్తే 140 శాతం వృద్ధి రేటు. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ వంటి ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగాయి.
నగరంలో ఇన్వెంటరీ 50,103 యూనిట్లు..
గృహాలకు డిమాండ్ పెరగడంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం నగరంలో 50,103 గృహాల ఇన్వెంటరీ ఉంది. వీటి నిర్వహణకు 25 నెలల కాలం పడుతుంది. కోల్‌కతాలో అతి తక్కువ ఇన్వెంటరీ (26,382 యూనిట్లు) ఉన్నప్పటికీ.. వీటి నిర్వహణకు మాత్రం 32 నెలల సమయం పడుతుంది. ముంబైలో 2,61,385 ఇన్వెంటరీ ఉంది. అహ్మదాబాద్‌లో 51,208, బెంగళూరులో 67,644, చెన్నైలో 35,145, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 1,00,559, పుణేలో 1,28,093 ఇన్వెంటరీ గృహాలున్నాయి.
కొత్త ప్రాజెక్ట్‌లు కూడా ఎక్కువే..
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్త గృహాల ప్రారంభాలు కూడా జోరుగానే సాగాయి. హైదరాబాద్‌లో క్యూ3లో 12,342 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గతేడాది క్యూ3తో పోలిస్తే 189 శాతం వృద్ధి. 2021 క్యూ3లోని లాంచింగ్ యూనిట్లలో 36 శాతం కోటి రూపాయల ధర ఉన్న గృహాలున్నాయి. దుండిగల్, తెల్లాపూర్, గోపన్‌పల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా లాంచింగ్స్ జరిగాయి.