-
- వరల్డ్ టాలెస్ట్ కో-లివింగ్ టవర్ అంటూ మోసం
- ఒక్కొక్కరి నుంచి రూ.59.55 లక్షలు వసూల్
- జీహెచ్ఎంసీ, రెరా అనుమతి లేదు
- బరితెగిస్తున్న అక్రమార్కులు
- చోద్యం చూస్తున్న సర్కారు
- చేతులెత్తేసిన రెరా అథారిటీ?
జీహెచ్ఎంసీ అనుమతి లేదు.. రెరా అనుమతి లేదు.. ప్రపంచంలోనే పేరెన్నిక గల సౌకర్యాలన్నీ పొందుపరుస్తామంటూ కొన్ని సంస్థలు కొత్త తరహా మోసానికి తెరలేపాయి. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల బదులు అక్రమార్కుల దృష్టి ఈసారి వాణిజ్య కట్టడాల మీద పడింది. ప్రపంచంలోనే అతి పొడవైన కో-లివింగ్ టవర్ ను నిర్మిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.59.55 లక్షల్ని వసూలు చేసే పనిలో పడింది. దీనికి స్ట్రాటజిక్ పార్ట్‌నర్ మై స్క్వేర్ రియాల్టీ అనే సంస్థ వ్యవహరిస్తోంది.
హైదరాబాద్ వన్.. అంటూ ఇంటర్నెట్‌లో నుంచి రకరకాల ఫోటోల్ని సేకరించి.. వాటితో ఒక ప్రజంటేషన్ ను సిద్ధం చేసి.. స్టూడెంట్ హౌసింగ్, కో- లివింగ్ స్పేసెస్ ను విక్రయించే పనిలో పడిందో సంస్థ. అసలు ప్రజల్నుంచి ఇంత సులువుగా లక్షలు వసూలు చేయవచ్చా? స్థలం చూపెట్టకుండా.. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా.. రెరా నెంబర్ లేకుండా.. ఇలాంటి ప్రజంటేషన్‌ని చూపెడితే.. వెనకా ముందు ఆలోచించకుండా ప్రజలు పెట్టుబడి పెడతారా? మరి, ఇందులో ప్రజలు సొమ్ము పెట్టిన తర్వాత.. ఆయా మొత్తంతో కంపెనీ ఉడాయిస్తే దానికి బాధ్యులెవరు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ఇలాంటి సంస్థల ఆగడాలకు ముందే రెరా అథారిటీ అడ్డుకట్ట వేయవచ్చు కదా!