poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌కి స‌రికొత్త మాస్ట‌ర్ ప్లాన్‌

  • అంత‌ర్జాతీయ క‌న్స‌ల్టెంట్ స‌హకారంతో
    18 నెల‌ల్లో పూర్తి చేస్తాం
  • ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా అభివృద్ధి
  • వ‌చ్చే 10-15 ఏళ్ల దాకా అభివృద్ధికి ఢోకా ఉండ‌దు
  • బిల్డ‌ర్లు స్వీయ‌నియంత్ర‌ణ పాటించాలి
  • ఎఫ్ఎస్ఐపై ఒక నిర్ణ‌యానికి రావాలి
  • జీనోమ్ వ్యాలీ.. వ్యాక్సీన్ క్యాపిట‌ల్ ఆఫ్ వ‌ర‌ల్డ్
  • మ‌న యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు
  • క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో ప్రారంభోత్స‌వంలో మంత్రి కేటీఆర్

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాల్ని క‌లిపి హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌రికొత్త మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందిస్తాం.. అంత‌ర్జాతీయ క‌న్స‌ల్టెంట్ల స‌హ‌కారం తీసుకుని వ‌చ్చే ప‌ద్దెనిమిది నెల‌ల్లో పూర్తి చేస్తాం.. ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా హైద‌రాబాద్ భ‌విష్య‌త్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బృహ‌త్ ప్ర‌ణాళిక‌ను తీర్చిదిద్దుతామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 2023 మార్చి 31లోపు రాష్ట్రంలోని 141 కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో మాస్ట‌ర్ ప్లాన్ల‌ను సిద్ధం చేస్తామ‌న్నారు.

ధ‌ర‌ణిలో రెండు, మూడు మాడ్యుళ్ల‌లో ఉన్న ఇబ్బందుల్ని ప‌రిష్క‌రించేందుకు చీఫ్ సెక్ర‌ట‌రీకి గుర్తు చేస్తాన‌ని తెలిపారు. రాష్ట్రంలో ఎవ‌రికైనా ప్లాటు ఉండీ.. ఇల్లు క‌ట్టుకుంటానంటే రూ.3 ల‌క్ష‌లు మంజూరు చేస్తున్నామ‌ని.. ఇలా మూడు ల‌క్ష‌ల యూనిట్ల నిర్మాణానికి రాష్ట్ర‌వ్యాప్తంగా మంజూరు చేశామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యే భాస్క‌ర్రావు, క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు, జనరల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు జి ఆనంద్‌ రెడ్డి, రాజేశ్వర్‌, జైదీప్‌ రెడ్డి, జగన్నాధ్‌ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, జాయింట్‌ సెక్రటరీలు శివరాజ్‌ ఠాకూర్‌, కె రాంబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

డీమానిటైజేష‌న్‌, ఆత‌ర్వాత క‌రోనా.. వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కునారిల్లిన నిర్మాణ రంగం దెబ్బ‌తిన‌కూడ‌ద‌నే రాష్ట్రంలో అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని కొన‌సాగిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కొంద‌రు ఎక‌రం స్థ‌లంలో ఆరేడు ల‌క్ష‌లు లేదా వ‌న్ మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల్లో ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌డ‌తామంటున్నారని.. అయినా వారికి ఇంత గ్రీడ్ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అప‌రిమిత ఎఫ్ఎస్ఐ మీద ప్రభుత్వం నియంత్ర‌ణ విధించ‌డం కంటే ముందే.. డెవ‌ల‌ప‌ర్లు స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని మంత్రి సూచించారు. ఒక ఎక‌రంలో4.5 లేదా 5 ఎఫ్ఎస్ఐ ఉంటే బాగుంటుంద‌ని సూచించారు. లేక‌పోతే బెంగ‌ళూరు త‌ర‌హాలో నియంత్ర‌ణ విధించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న్నారు. డెవ‌ల‌ప‌ర్లు ప్రాథ‌మిక అవ‌స‌రాల మీద దృష్టి పెట్ట‌కుండా.. పార్కింగులు, సివ‌రేజీ, మంచినీరు లేకుండా ఆకాశ‌హ‌ర్మ్యాలు క‌డితే.. హైద‌రాబాద్ మీద ఒత్తిడి పెరుగుతుంద‌ని వివ‌రించారు. కాబ‌ట్టి, ఈ విష‌యంలో ఆయా స‌భ్యుల‌కు నిర్మాణ‌ సంఘాలే పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాలని తెలిపారు. బిల్డ‌ర్ల‌కు లాభాపేక్ష ఉండాల్సిందేన‌ని.. కాక‌పోతే దానికో ప‌రిమితీ ఉండాలని హితువు ప‌లికారు. బంగారు గుడ్ల‌ను పెట్టే బాతుగుడ్డ‌ను ఒకేసారి కోస్తే నగ‌రం నాశ‌నం అవుతుంద‌న్నారు. ఇందుకోసం కావాలంటే టీడీఆర్‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. న‌గ‌రాభివృద్ధిలో భాగ‌స్వామ్యులు కావాల‌ని.. మ‌న పిల్ల‌ల‌కు ఉపాధి అవ‌కాశాల్ని క‌ల్పించే దిశ‌గా నిర్మాణ సంఘాలు అడుగులు ముందుకేయాల‌ని కోరారు.

 

ఎలాంటి ఢోకా ఉండ‌దు..

రానున్న‌ ప‌ది, ప‌దిహేనేళ్ల దాకా నిర్మాణ రంగానికి ఢోకా లేద‌ని.. హైద‌రాబాద్ అభివృద్ధికి ఎలాంటి అడ్డు ఉండ‌ద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. మ‌త‌క‌ల్లోలాలు, ప‌నికిమాలిన పంచాయ‌తీలు, మతం పేరిట కుమ్ములాట‌లు, క‌ర్ఫ్యూలు వంటివి లేక‌పోతే హైద‌రాబాద్ పెరుగుతుంద‌న్నారు. మ‌నం కూడా హ‌లాల్, హిజాబ్ వంటివి పెట్టుకుంటే న‌ష్ట‌పోతామ‌న్నారు. శాంతి సామ‌ర‌స్యాలు ఉంటేనే న‌గ‌రం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. పాజిటివ్‌, ప్రొగ్రెసివ్ అవుట్‌లుక్.. ఉంటేనే హైద‌రాబాద్ డెవ‌ల‌ప్ అవుతుంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలకు కేసీఆర్‌ని త‌రిమివేయండి అన్న మాట ఒక్క‌టే తెలుస‌ని.. వాళ్లు రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్ప‌ర‌ని.. జాతీయ ప్రాజెక్టు ఏమైనా తెస్తారా అంటే చెప్ప‌రని విమ‌ర్శించారు. వ‌చ్చే ఇర‌వై ఏళ్ల‌కు వారి విజ‌న్ ఏమిట‌ని అడిగితే.. చెప్ప‌గ‌లిగే వారు ఒక్క‌రూ లేర‌న్నారు. గ‌త ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణ అభివృద్ధి చెంద‌డానికి కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని విశ్లేషించారు.

బిల్డ‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి..

ఎంత‌సేపు కోకాపేట్‌, కొల్లూరే కాకుండా బిల్డ‌ర్లు కొత్త అవ‌కాశాల్ని అన్వేషించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఫార్మా సిటీ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. అతిత్వ‌ర‌లో లాంచ్ చేయ‌నున్నాం. ముచ్చ‌ర్ల‌, క‌ల్వ‌కుర్తి, అమ‌న్‌గ‌ల్‌, వెల్దండ‌, క‌ర్తాల్‌, కందుకూరు వంటి చోట్ల ఎందుకు కొత్త కాల‌నీలు క‌డ‌తలేరని ప్ర‌శ్నించారు. దుండిగ‌ల్లో కొత్త ఎల‌క్ట్రానిక్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ క్ల‌స్ట‌ర్‌ పెడుతున్నాం. దాని ప‌క్క‌నే సుల్తాన్‌పూర్‌లో మెడిక‌ల్ డివైజెస్ పార్కు ఫుల్ అయ్యింది. ప‌క్క‌నే ఖాజీప‌ల్లిలో ఐదారు వంద‌ల ఎక‌రాల్ని తీసుకుంటున్నాం. అక్క‌డెందుకు హౌసింగ్ క‌ట్ట‌రని అడిగారు. బిల్డ‌ర్లు గ్రోత్ సెంట‌ర్ల వ‌ద్ద దృష్టి పెట్టాల‌ని కోరారు. కొత్త‌గా లాజిస్టిక్ పార్కులను ఎంక‌రేజ్ చేస్తున్నాం. భూమి కోటీ, కోటిన్న‌ర ఉన్న చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. అక్క‌డా దృష్టి పెట్టండి. రీజిన‌ల్ రింగ్ రోడ్డు త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంది. స్థ‌ల సేక‌రణ ఆరంభ‌మైంది. 330 కిలోమీట‌ర్ల మేర‌కు ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

న‌గ‌రంలో ప్ర‌తిరోజు 2000 మిలియ‌న్ లీట‌ర్ల కంటే ఎక్కువ సివ‌రేజీ ఉత్ప‌త్తి అవుతోందని.. రూ. 3866 కోట్ల‌తో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా వంద శాతం సివ‌రేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఇది దేశంలోనే స‌రికొత్త రికార్డు అవుతోందన్నారు. కొత్త రోడ్ల‌ను చూసి సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌శంసించ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు. హైద‌రాబాద్ చుట్టూ 148 కొత్త లింకు రోడ్ల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని.. ఎస్సార్డీపీలో 19 ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు అభివృద్ధి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. లేక‌పోతే బెంగ‌ళూరు మాదిరిగా అయిపోతామ‌న్నారు. మ‌న భాగ్య‌న‌గ‌రం ప‌ర్యావ‌ర‌ణ‌హితం కావాలనే ఉద్దేశ్యంతో భారీ స్తాయిలో ప్లాంటేష‌న్ చేస్తున్నామ‌ని చెప్పారు. నిర్మాణ రంగం కుదేలైంద‌న‌డం క‌రెక్టు కాదన్నారు. 2021లో 53 నెల‌ల ఇన్వెంట‌రీ ఉంటే, 2022 నాటికి 23కి త‌గ్గింద‌ని నైట్ ఫ్రాంక్ తెలియ‌జేసింద‌ని గుర్తు చేశారు. సిమెంటు, స్టీలు కంపెనీలు కుమ్మ‌క్కు కావ‌డం వ‌ల్ల ధ‌ర‌లు కృత్రిమంగా పెరుగుతున్నాయని.. వాటిని నియంత్రిస్తామ‌ని తెలిపారు. అమెజాన్ 2.77 బిలియ‌న్ డాల‌ర్లు, మైక్రోసాఫ్ట్ 2 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ముచ్చ‌ర్ల‌, చంద‌న్ వేలిలో డేటా సెంట‌ర్లు వ‌స్తున్నాయని వెల్ల‌డించారు.

 

వ్యాక్సీన్ క్యాపిట‌ల్ ఆఫ్ వ‌ర‌ల్డ్

మ‌న వ‌ద్ద జీనోమ్ వ్యాలీ బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చెందుతోందని.. ప్ర‌పంచంలోని 33 శాతం హ్యూమ‌న్ వాక్సీన్లు హైద‌రాబాద్‌లోనే ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని తెలిపారు. మ‌న హైద‌రాబాద్ వ్యాక్సీన్ క్యాపిట‌ల్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అయ్యిందని సంతోషం వ్య‌క్తం చేశారు. ద‌ట్స్ ద మ్యాట‌ర్ ఆఫ్ ద గ్రేట్ ప్రైడ్.. రానున్న దశాబ్దం, ద‌శాబ్దంన్న‌ర‌లో.. హెల్త్ కేర్ సెంట‌ర్ స్టేజ్ కానున్న‌ది. లైఫ్ సైన్సెస్‌, ఫార్మా స్యూటిక‌ల్స్‌, బ‌యో ఫార్మా, బ‌యోటెక్నాల‌జీ, బ‌యో స్టాటిస్టిక్స్‌, బ‌యో ఇన్‌ఫార్మెటిక్స్ వంటివి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

బిల్డ‌ర్ల‌కు మాదాపూర్‌, గ‌చ్చిబౌలి, కోకాపేట్‌, కొల్లూరు వంటి ప్రాంతాలే కాకుండా.. జీనోమ్ వ్యాలీ, సుల్తాన్‌పూర్, దుండిగ‌ల్‌లో అవ‌కాశాలున్నాయ‌నే విష‌యం తెలియ‌దన్నారు. అలా కాకుండా ఇత‌ర న‌గ‌రాల‌కూ మ‌న బిల్డ‌ర్లు విస్త‌రించాలని సూచించారు. బ‌య‌ట‌పోయి ఎక్క‌డైనా వ్యాపారం చేస్తేనే మ‌న ప్ర‌భుత్వం గొప్ప‌త‌న‌మేమిటో తెలుస్తుందని చ‌మ‌త్క‌రించారు. టీఎస్ బీపాస్ దేశంలో ఎక్క‌డైనా ఉన్న‌దా? వేరే రాష్ట్రాల్లో ఇంత వేగంగా క్లియ‌రెన్సులు రావని. గ‌వ‌ర్నెన్స్‌లో తేడా కూడా తెలుస్తుందన్నారు.

 

మ‌న యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ కేంద్రం

హైద‌రాబాద్‌లో ఏ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సైటుకెళ్లినా 60, 70 శాతం మంది జార్ఖండ్‌, బీహార్‌, ఒరిస్సా, రాజ‌స్థాన్ వాళ్లేన‌ని తెలిపారు. కార్పెంట‌రీ, ఇంటీరియ‌ర్స్ ఇలా ఏ ప‌ని అయినా ఇత‌ర రాష్ట్రాల వాళ్లే ఉంటారు. మ‌రి, మ‌న వాళ్లు ఏం చేస్తున్న‌రు? దుబాయ్‌, కువైట్‌, ఖ‌తార్ పోతున్న‌రు. అక్క‌డ ఎర్ర‌టి ఎండ‌ల్లో నానా అవ‌స్థ‌లు ప‌డుతూ.. తిప్పితిప్పి కొడితే నెల‌కు ఇర‌వై ఐదు వేలు సంపాదిస్తున్నారు. లేబ‌ర్ క్యాంపుల్లో ఉండి ప‌ని చేస్తున్నారు. ఇక్క‌డ అంత‌కంటే ఎక్కువ సంపాదించుకునే అవ‌కాశ‌ముంది క‌దా.. మ‌న కామారెడ్డి, నిర్మ‌ల్‌, క‌రీంన‌గ‌రోళ్లు దుబాయ్‌, గ‌ల్ఫ్ దేశాల‌కు వెళుతున్నారు. ఎక్క‌డో మిస్ మ్యాచ్ ఉంది. ఇదే సెంట్రింగ్ ప‌ని, నిర్మాణాల్లో ప‌నిని అక్క‌డా చేస్తున్నారని తెలిపారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి నిర్మాణ సంఘాల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. “మీరు ముందుకొస్తే.. క‌లిసి కొత్త‌గా శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మ‌న రాష్ట్రంలో.. మ‌న పిల్ల‌లకిఇక్క‌డే కాన్ఫిడెన్స్ ఇచ్చేలా చేద్దాం. మ‌న రాష్ట్రంలో, మ‌న‌మే శిక్ష‌ణనిచ్చి, ఇక్క‌డే కంపెనీలో పెట్టుకునేలా చేస్తే వారిలో విశ్వాసం ఏర్ప‌డుతుంది. ఇక్క‌డ ఎన్ఏసీ పెట్టాం. రోడ్డు వేసే కంట్రాక్ట‌ర్ల‌కే సంబంధం ఉండే వ్య‌వ‌స్థ‌గా మారింది. మీరు ఇంత ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తూ.. ఇన్ని కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌డుతూ.. ఇన్ని కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వానికి ప‌న్నుల రూపంలో క‌డుతున్నారు. బ‌య‌టి రాష్ట్రాల లేబ‌ర్ వెళ్లిపోతే ఇబ్బంది అంటున్నారు. ఆ దుస్థితి మ‌న‌కెందుకు? మ‌న‌వాళ్ల‌నే ప‌ట్టుకుని శిక్ష‌ణ‌నిద్దాం. బ్లూ కాల‌ర్ జాబ్స్ ఇద్దాం. ఒక‌వేళ చిరు ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మైతే మీకు న‌చ్చితే విస్త‌రిద్దాం. మొద‌ట క్రెడాయ్ హైద‌రాబాద్‌తో మొద‌లెడ‌దాం. త‌ర్వాత క్రెడాయ్ తెలంగాణ‌కు విస్త‌రిద్దాం. మీకో ఇన్‌స్టిట్యూట్ కావాలి. కొంత స‌పోర్టు కావాలి. త‌ప్ప‌కుండా మేం చేస్తాం. సెట‌ప్ లో మీరు ముందుకొచ్చి మాకు హెల్ప్ చేయండ”ని కోరారు.

111 జీవో ఎత్తివేసే ప్ర‌క్రియ‌
వైఎస్సార్ హ‌యంలోనే!

ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తి వేసే ప్ర‌క్రియ వైఎస్సార్ హ‌యంలో ఆరంభ‌మైందని.. అప్పుడే ఒక క‌మిటీ వేశార‌ని గుర్తు చేశారు. కేసీఆర్ 2014 కంటే ముందే.. చేవేళ్ల‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, వికారాబాద్ ప‌బ్లిక్ మీటింగుల్లో 111 జీవో ఎత్తివేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత జీవోను ర‌ద్దు చేశార‌ని తెలిపారు. అప్ప‌ట్లో ఈ జంట జ‌లాశ‌యాల నుంచి జంట న‌గ‌రాలకు 27 శాతం తాగునీరు వ‌చ్చేవని.. ఈ రోజు గోదావ‌రి, కృష్ణా నుంచి నీళ్లు వ‌స్తున్నా కాబట్టి.. జంట జ‌లాశ‌యాల్నుంచి నీరు తీసుకోన‌క్క‌ర్లేద‌న్నారు. అలాంట‌ప్పుడు, ఆ 84 గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఎందుకు న‌ష్టం చేయాల‌ని అనుకున్నామ‌ని చెప్పారు. కాక‌పోతే, ఆయా ప్రాంతాల్ని కాలుష్యం బారిన ప‌డ‌కుండా.. హుస్సేన్ సాగర్ మాదిరిగా కాకుండా.. స‌వ్య‌మైన ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామంటే త‌ప్పేం ఉందన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు అక్క‌డివాళ్ల‌కు మాటిచ్చారని.. ప్ర‌తి పార్టీ చెప్పిందని.. కానీ, కేసీఆర్ చేస్తే భూములున్నాయంటూ దురుద్దేశ్యాలు ఆపాదిస్తున్నారని తెలిపారు. ట్రిపుల్ జీవో ప్రాంతాల్లో గ‌ల 1.32 ల‌క్ష‌ల ఎక‌రాలు.. 535 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లలో కొత్త న‌గ‌రం సృష్టించొచ్చ‌ని.. హారిజాంట‌ల్ గ్రోత్ ప్లాన్ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర భ‌విష్య‌త్తుకు ఇబ్బంది లేకుండా.. పర్య‌వార‌ణ హితంగానే అభివృద్ధి చేస్తామ‌ని.. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు, అపోహ‌లు ఉండొద్దని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ముందుచూపు వ‌ల్ల ఇదివ‌ర‌కే 600 మిలియ‌న్ గ్యాల‌న్స్ మంచినీటి ల‌భిస్తోంది. దీంతో పాటు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ ద‌గ్గ‌ర‌కు రావ‌డం వ‌ల్ల అద‌నంగా 300 మిలియ‌న్ గ్యాల‌న్స్ నీరు ల‌భించే అవ‌కాశం ఉంది. భ‌విష్య‌త్తులో ప్ర‌తిరోజు హైద‌రాబాద్‌కి మంచినీటిని అందించే అవ‌కాశ‌ముంది. ఎక్కువ గంట‌లు నీళ్లిచ్చే అవ‌కాశ‌ముంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles