హైదరాబాద్ ఫార్మా సిటీ జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా భావించేవారని, ఇప్పుడది అంతర్జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందని మంత్రి కేటీఆర్..
- ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం
- మనకు 3.8 కోట్ల డోసులు కావాలి
- వాట్సప్ నిపుణులకు సూచనలు పట్టించుకోవద్ద
- సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లకు దూరం ఉండాలి
- వెల్లడించిన మంత్రి కేటీఆర్
కొవిడ్ సంక్షోభం వల్ల ఫార్మా సిటీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమే లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నిన్నటివరకూ హైదరాబాద్ ఫార్మా సిటీ జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా భావించేవారని, ఇప్పుడది అంతర్జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
‘‘ఆస్క్ కేటీఆర్’’ ద్వారా ఆయన కరోనా పేషెంట్లు, వారి కుటుంబాలకు సరికొత్త భరోసా కల్పించారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి వస్తున్న రోగులకు సైతం చికిత్స అందిస్తుందని, ఈ అద్భుతమైన ప్రయత్నంలో భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 2021 ఆగస్టు నుంచి డిసెంబరు దాకా 216 కోట్ల వ్యాక్సీన్ డోస్లు లభిస్తాయని నీతిఆయోగ్ వీకే పాల్ తెలిపారని గుర్తు చేశారు. సినోవాక్, ఫైజ్, మాడర్నా.. వ్యాక్సీన్ ఏదైనా ప్రజల జీవితాల్ని కాపాడితే చాలన్నారు.
కరోనా చెయిన్ బ్రేక్ అవ్వాలంటే కనీసం డెబ్బయ్ శాతం మంది ప్రజలకు టీకాలు వేయించాలని వెల్లడించారు. పద్దెనిమిదేళ్లు దాటిన వారు 2.9 కోట్లు ఉండగా.. కనీసం 1.9 కోట్ల మందికి టీకా లభించాలన్నారు. రెండు డోసులు కాబట్టి, మొత్తం 3.8 కోట్ల డోసుల టీకాలు అవసరం అవుతాయన్నారు. అమెరికా వ్యాక్సీన్ల వాడకాన్ని అతిత్వరలో కేంద్రం అనుమతించే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ల తో మాట్లాడుతున్నామని తెలిపారు. త్వరలోనే ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్ లకు సైతం అనుమతి లభిస్తుందని, ఆగస్టు మాసాంతానికి దేశీయంగా బయోలాజికల్-ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాకు దూరం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తామని ప్రజల్తో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనల్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. సొంత వైద్యం పనికిరాదని కేవలం వైద్య నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలన్నారు. మానసికంగా బలంగా ఉండాలని, కోవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
కరోనా ఎలా అధిగమించానంటే?
తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీల జ్వరం కొనసాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదని… తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్ మరియు హైపర్టెన్షన్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందన్నారు. అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అధిగమించానని వివరించారు. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తుందని, అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నానని కేటీఆర్ తన కోవిడ్ రికవరీ అనుభవాన్ని పంచుకున్నారు.