-
- నాలుగేళ్లయినా పత్తాలేని బడా రియల్ సంస్థ
-
- మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయలేదు
- ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ తెచ్చుకోలేదు
- లబోదిబోమంటున్న కొనుగోలుదారులు
లేఅవుట్ వేసేందుకు టెంటటీవ్ అప్రూవల్ తెచ్చామా.. ఏజెంట్లకు సమాచారం ఇచ్చామా.. ప్లాట్లు విక్రయించామా.. డబ్బులు తీసుకుని ఉడాయించామా.. అన్నట్లుగా కొందరు రియల్టర్లు వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో చిన్నాచితకా రియల్టర్లతో పాటు బడా స్టార్లతో బ్రాండింగ్ చేయించే రియల్ సంస్థలూ ఉన్నాయంటే నమ్మండి. వీరి వద్ద కొనుగోలు చేసిన అనేక మంది బయ్యర్లు.. ఆయా ప్లాట్లలో ఇల్లు కట్టుకుందామంటే స్థానిక సంస్థల నుంచి అనుమతి రాక ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ రాకపోవడంతో.. అందులో కొన్నవారంతా లబోదిబోమంటున్నారు.
భూమిలో సిరులు పండిస్తామని ప్రచారం నిర్వహిస్తూ బీభత్సంగా ప్లాట్లను విక్రయించే ఓ రియల్ సంస్థ.. పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డు చేరువలోని ఇంద్రేశంలో ఒక లేఅవుట్‌ని అభివృద్ధి చేసింది. బడా సినీ తారలతో అట్టహాసంగా ప్రచారాన్ని నిర్వహించే ఈ సంస్థ.. వోల్వో బస్ బాడీ యూనిట్ వద్ద ఎల్‌పీ నెంబరుతో వెంచర్ వేసింది. సినీ తారల ఫోటోలతో ప్రచారం నిర్వహిస్తే వేడి పకోడిల్లా ప్లాట్లు అమ్ముడవుతాయనే విషయం తెలిసిందే. సరిగ్గా, ఇక్కడా అదే జరిగింది. పటాన్ చెరు దగ్గరన్నారు.. ఓఆర్ఆర్ చేరువలో అని చెప్పారు.. ఎంచక్కా ప్లాట్లను అమ్మేశారు. ఈలోపు కరోనా వచ్చింది.. నాలుగేళ్లు గడిచింది. కొన్నవాళ్లు అక్కడికెళ్లి ఓ చిన్న ఇల్లు కట్టుకుందామంటే స్థానిక సంస్థ అనుమతినివ్వని పరిస్థితి. కారణం ఏమిటంటే.. అంత బడా రియల్ సంస్థ ఇంకా ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ తీసుకోలేదు. ఈ విషయం విని ఒక్కసారిగా బయ్యర్లు లబోదిబోమంటున్నారు.
అధికారులేమంటారంటే..
రియల్టర్ ఎవరైనా.. హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుని.. ఎల్‌పీ నెంబరు సాయంతో వెంచర్ అభివృద్ధి చేస్తారు. అందులో రోడ్లు వేస్తారు. డ్రైనేజీ, మంచినీటి కనెక్షన్లు ఇస్తారు. పార్కుల కోసం స్థలాన్ని కేటాయిస్తారు. ఇలా, మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా అభివృద్ధి చేశాక.. హెచ్ఎండీఏ వద్దకెళ్లి ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ తెచ్చుకుంటారు. దాన్ని ఆధారంగానే అందులో కొన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు అనుమతి లభిస్తుంది. మంచినీటి, విద్యుత్తు కనెక్షన్లను స్థానిక సంస్థ అందజేస్తుంది. కాకపోతే, ఇక్కడ జరిగిందేమిటంటే.. ప్లాట్లను విక్రయించిన తర్వాత అందులో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం చేసిందా బడా కంపెనీ. అందుకే, అందులో ఇల్లు కట్టుకునేందుకు కొనుగ¥లుదారులకు అనుమతి లభించట్లేదు. దీంతో, ఎవరిని సంప్రదించాలో తెలియక బయ్యర్లు అయోమయంలో పడ్డారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక తలపట్టుకుంటున్నారు. ఇప్పటికైనా, ఆ బడా రియల్ సంస్థ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసి.. ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలని కోరుతున్నారు.