దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కరోనాను కూడా లెక్క చేయకుండా.. కొనుగోలుదారులు ఫ్లాట్లను కొనడానికి ముందుకొస్తున్నారు. నిన్నటివరకూ ఆకాశహర్య్మాలంటే భయపడిన బయ్యర్లు.. ప్రస్తుతం స్కై స్క్రేపర్లలో కొనడానికి సంకోచించడం లేదు. పశ్చిమ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఆరంభమైన ఆకాశహర్మ్యాల్లో జరుగుతున్న కొనుగోళ్లే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. నగరంలోని ల్యాండ్ మార్కుగా నిలిచే ప్రాజెక్టుల్లో నివసించేందుకు అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
హైదరాబాద్‌లోని మాదాపూర్, షేక్ పేట్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్‌రాంగూడ, నార్సింగి వంటి ప్రాంతాల్లో నగరానికి చెందిన పలు సంస్థలు ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నారు. ఎస్ఏఎస్ కన్‌స్ట్రక్షన్స్, సుమధుర-వాసవి, అరబిందో, క్యాండియర్, మైహోమ్, రాజపుష్ప, అపర్ణా, డీఎస్పార్ వంటి సంస్థలు ఇందుకు శ్రీకారం చుట్టాయి. 40 అంతస్తుల ఆకాశహర్మ్యం నిర్మించేందుకు బెంగళూరుకు చెందిన క్యాండియర్ సంస్థ మియాపూర్ వంటి ప్రాంతాన్ని ఎంచుకుంది. దాదాపు అన్ని కంపెనీలు నిర్మాణ పనుల్ని జోరుగా జరిపిస్తున్నాయి. మరి, భాగ్యనగరంలో 30 అంతస్తుల కంటే అధిక ఎత్తులో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలేమిటంటే..
1) 58 అంతస్తుల ఎస్ఏఎస్ క్రౌన్
కోకాపేట్
4.2 ఎకరాలు
235 ఫ్లాట్లు
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యానికి తెలంగాణ రెరా అథారిటీ అనుమతినిచ్చింది. ఎస్ఏఎస్ క్రౌన్ అని నామకరణం చేసిన ఈ జి+57 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని సాస్ (ఎస్ఏఎస్) సంస్థ కోకాపేట్‌లోనిర్మిస్తోంది. సుమారు 4.2 ఎకరాల్లో.. నిర్మించే ఈ ప్రాజెక్టులో ఐదు టవర్లను డిజైన్ చేశారు. ఇందులో వచ్చవేన్నీ నాలుగు అంతస్తుల ఫ్లాట్లే. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే.. మూడంటే మూడే సైజులున్నాయి. ఒకటి 6565 చదరపు అడుగులు, మరోటి 6999 చ.అ., ఇంకోటి 8811 చదరపు అడుగుల్లో కడుతున్నారు. డ్యూప్లే ఫ్లాట్లను పదిహేడు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ధర విషయానికి వస్తే.. మొదటి రకానికి రూ.6.57 కోట్లు, రెండు రకం రూ.7 కోట్లు, 8811 చ.అ.ఫ్లాటుకు రూ.8.81 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. డ్యూప్లే ఫ్లాటు కావాలంటే రెండింతలు పెట్టాల్సిందే.
2) 44 అంతస్తులు: సుమధుర ఒలంపస్
నానక్‌రాంగూడ
విస్తీర్ణం: 5.06 ఎకరాలు
సంఖ్య: 854
హైదరాబాద్‌లో రెండో అతి ఎత్తయిన ఆకాశహర్మ్యం సుమధుర ఒలంపస్. 46 అంతస్తుల ఎత్తయిన ఈ స్కై స్క్రాపర్‌ని సుమధుర గ్రూప్, వాసవి గ్రూప్‌లు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో సుమారు 5.2 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 854 ఫ్లాట్లు వస్తాయి. 46 అంతస్తుల ఎత్తులో ట్విన్ టవర్లుగా ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నాయి. 2027 జనవరిలోపు ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులకు అందించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాయి.
3) 42 అంతస్తుల అరబిందో కొహినూర్
హైటెక్ సిటీ రోడ్డు
12.3 ఎకరాలు
776 ఫ్లాట్లు
హైదరాబాద్‌లో మూడో అతిపెద్ద ఆకాశహర్మ్యం.. అరబిందో కొహినూర్. జి+41 అంతస్తుల ఎత్తు గల ప్రాజెక్టును హైటెక్ సిటీ చేరువలో అరబిందో సంస్థ అభివృద్ధి చేస్తోంది. 12.3 ఎకరాల విస్తీర్ణంలో.. 2020 జనవరిలో ఆరంభమైన ఈ ప్రాజెక్టును 2026 జనవరిలో అందజేస్తారు. మొత్తం ఏడు టవర్లలో.. 1296- 3094 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు లభిస్తాయి.
4) క్యాండియర్ 40
మియాపూర్
4.82 ఎకరాలు
3 టవర్లు- 959 ఫ్లాట్లు
మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే రహదారిలో బెంగళూరుకు చెందిన క్యాండియర్ సంస్థ.. క్యాండియర్ ఫార్టీ అనే ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 4.82 ఎకరాల్లో 959 ఫ్లాట్లను నిర్మిస్తోంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 సెప్టెంబరులో ప్రాజెక్టును కొనుగోలుదారులకు అప్పగిస్తామని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం మూడు టవర్లలో నిర్మాణ పనులు యమజోరుగా జరుగుతున్నాయి. ఇందులో
1170- 1610 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు లభిస్తాయి. ఇప్పటికే అధిక శాతం ఫ్లాట్లు ఇందులో అమ్ముడయ్యాయి.
5) 40 అంతస్తులు: లాన్సమ్ ఎల్డొరాడో
నార్సింగి
4.25 ఎకరాలు
873 ఫ్లాట్లు
లాన్సమ్ ఎటానియా ఎల్ఎల్పీ సంస్థ నార్సింగిలో నలభై అంతస్తుల ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది.
దీనికి లాన్సమ్ ఎల్డోరాడో అని పేరు పెట్టారు. సుమారు 4.25 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో రెండు టవర్లలో.. 873 ఫ్లాట్లను నిర్మిస్తారు. ఫ్లాట్ల విస్తీర్ణం.. 1540- 2240 చదరపు అడుగుల్లో డిజైన్ చేశారు. 2021 మార్చిలో ఆరంభమైన ఈ ప్రాజెక్టును 2027 జనవరిలో పూర్తి చేస్తామని సంస్థ చెబుతోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
6) 40 అంతస్తుల.. రాజపుష్ప ప్రావిన్షియా
నార్సింగి
23.75 ఎకరాలు
3,498 ఫ్లాట్లు
రాజసం ఉట్టిపడే నిర్మాణాల్ని చేపట్టే రాజపుష్ప ప్రాపర్టీస్.. నార్సింగి చేరువలో రాజపుష్ప ప్రావిన్షియా అనే ప్రాజెక్టును జి+39 అంతస్తుల్లో ఆరంభించింది. దాదాపు 23.75 ఎకరాల్లో విస్తీర్ణంలో.. 11 టవర్లలో.. సుమారు 3,498 ఫ్లాట్లను నిర్మిస్తారు. 1370- 2660 చదరపు అడుగుల్లో ఫ్లాట్లను కడుతున్నారు. 2025 మార్చిలో మొదటి విడత ఫ్లాట్లను అందించేందుకు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో రెండు క్లబ్‌హౌజులకు స్థానం కల్పించారు.
7) 36 అంతస్తులు: మై హోమ్ భూజ
హైటెక్ సిటీ
18 ఎకరాలు
1544 ఫ్లాట్లు
మై హోమ్ సంస్థ హైటెక్ సిటీ చేరువలో మైహోమ్ భూజా ప్రాజెక్టును 18 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఏడు టవర్లలో మొత్తం 1544 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మూడు పడక గదుల ఫ్లాట్లు.. 2595, 2680, 3430 చదరపు అడుగుల విస్తీర్ణంలో లభిస్తాయి. 4 పడక గదుల ఫ్లాట్లేమో 4070 చదరపు అడుగుల్లో దొరుకుతాయి. ఇది ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం ప్రాజెక్టు కావడం గమనార్హం.
8) 35 అంతస్తులు: అపర్ణా వన్
అపర్ణా వన్
షేక్‌పేట్
9.75 ఎకరాలు
464 ఫ్లాట్లు
హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఆధునిక లగ్జరీ ప్రాజెక్టులకు సరికొత్త చిరునామాగా నిలుస్తుంది.. అపర్ణా వన్. ఫిలింనగర్ చేరువలోని షేక్ పేట్ ప్రధాన రహదారి మీద రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి 464 ఫ్లాట్లు. 2022 డిసెంబరులోపు కొనుగోలుదారులకు అందించడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది. ఇందులో 3,4 బీహెచ్‌కే ఫ్లాట్లు లభిస్తాయి. 2876, 5216 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు.
9) 32 అంతస్తులు: మైహోమ్ తర్క్క్ష్య
కోకాపేట్
6 ఎకరాలు
660 ఫ్లాట్లు
మై హోమ్ సంస్థ కోకాపేట్లో 32 అంతస్తుల ఎత్తులో మై హోమ్ తర్క్క్ష్య అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దాదాపు ఆరు ఎకరాల్లో నాలుగు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 660 ఫ్లాట్లు వస్తాయి. ఫ్లాట్ల విస్తీర్ణం.. 1957 నుంచి 2235 చదరపు అడుగుల్లో ఉంటాయి. మై హోమ్ తర్క్క్ష్యలో వచ్చేవన్నీ ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లే కావడం గమనార్హం. నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును 2023 జులైలో కొనుగోలుదారులకు అందజేస్తామని మైహోమ్ సంస్థ చెబుతోంది.
10) 30 అంతస్తుల డీఎస్సార్ ద ఫస్ట్
గచ్చిబౌలి
4ఎకరాలు
100 ఫ్లాట్లు
డీఎస్ఆర్ సంస్థ ద ఫస్ట్ అనే ప్రాజెక్టును 30 అంతస్తుల ఎత్తులో నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించింది. గచ్చిబౌలిలో సుమారు 4 ఎకరాల్లో ఒక టవర్ నిర్మిస్తోంది. ఇందులో వచ్చేవన్నీ 6666 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లే కావడం గమనార్హం. మొత్తం వంద ఫ్లాట్లను కడుతోంది. 2023 మేలోపు ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని శరవేగంగా జరుగుతున్నాయి.
* పూర్తి వివరాల కోసం బిల్డర్‌ను సంప్రదించండి.
(కింగ్ జాన్సన్ కొయ్యడ)