- నోయిడా ట్విన్ టవర్ల వెనుక ఆసక్తికర విషయాలు
నోయిడాలో సూపర్ టెక్ అక్రమంగా నిర్మించిన జంట టవర్ల వెనుక పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మూడేళ్ల పాటు నిర్మాణం జరిగిన ఈ భవనాలను కోర్టు ఆదేశాలతో 12 సెకన్లలో కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కట్టడం ప్రారంభం దగ్గర నుంచి కూల్చివేత వరకు పెద్ద కథే నడిచింది. ఏకంగా పదేళ్ల పాటు ఐదుగురు సీనియర్ సిటిజన్ల అలుపెరగని పోరుతోనే ఈ అక్రమ కట్టడం నేలమట్టమైంది. కోర్టు కేసు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా.. వారు వెనకడుగు వేయలేదు. కోర్టు విచారణ కోసం జనరల్ బోగీల్లో ప్రయాణించడం దగ్గర నుంచి కోర్టులో జరిగిన వాదనలను క్షుణ్ణంగా పరిశీలించడం, దానికి తగినట్టుగా లాయర్ తో కలిసి తదుపరి వాదనలు సిద్ధం చేయడం, కేసు కొనసాగింపునకు అవసరమైన డబ్బును సమీకరించుకోవడం వంటి ఎన్నో పనులు చేశారు.
2010లో ఎమరాల్డ్ కోర్టు నివాసి, సీఆర్పీఎఫ్ రిటైర్డ్ డీఐజీ యూబీఎస్ తోతియా (80) ఈ కేసు పెట్టారు. ఆ ఏడాది వర్షాకాలంలో బేస్ మెంట్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. తోతియా, ఇతర స్థానికులు తమ కార్ల దగ్గరకు పడవల్లో వెళ్లాల్సి వచ్చింది. దీంతో తొలిసారిగా బిల్డర్ వద్ద ఈ విషయంపై ఆందోళన చేశారు. కొన్ని వారాల తర్వాత గార్డెన్ కోసం నిర్దేశించిన స్థలంలో తవ్వకాలు మొదలుకావడంపై ఆరా తీయగా.. అక్కడ 25 అంతస్తుల భవనం వస్తుందని తెలుసుకున్నారు. వెంటనే దీనిపై నివాసితుల సంక్షేమ సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. సంఘం సభ్యులంతా తమ తమ ఉద్యోగాల్లో బిజీగా ఉండటంతో దీనిని పట్టించుకోలేదు.
అంతేకాకుండా పలువురు తమను హేళన చేయడమే కాకుండా పని చూసుకోవాలంటూ బెదిరించారని తోతియా తెలిపారు. దీంతో జంట టవర్ల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటాననే హామీతో 2011లో తోతియా నివాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 2012లో జంట టవర్ల అక్రమ నిర్మాణంపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ పై తోతియాతోపాటు రవి బజాజ్ (72), ఎస్కే శర్మ (75), ఎంకే జైన్ (70), గౌరవ్ దేవ్ నాథ్ (70) సంతకాలు చేశారు. దీనిపై మొత్తం 20 సార్లు విచారణ జరగ్గా.. తాము 15 సార్లు కోర్టుకు వెళ్లామని, రిజర్వేషన్ లేని బోగీల్లో ప్రయాణించామని తోతియా నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, దీనిని సూపర్ టెక్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో పోరు కొనసాగింది. చివరకు సుప్రీంకోర్టు సైతం అవి అక్రమమని తేల్చడంతోపాటు వెంటనే కూల్చివేయాలని ఆదేశించడంతో సూపర్ టెక్ సంస్థకు భంగపాటు తప్పలేదు.