ప్రముఖ రియల్ ఎస్టట్ బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టో ఎక్స్ పర్ట్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 56 శాతం మేర పెరిగి రూ.56 కోట్లకు చేరింది. హౌసింగ్ కు గట్టి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా విలువైన ఇళ్ల అమ్మకాల్లో పాలుపంచుకుంది. 2022-23లో ఈ సంస్థ ఆదాయం రూ.36 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.56 కోట్లకు పెరిగింది. నోయిడాకు చెందిన ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,050 కోట్లకు పైగా విలువైన ఇళ్లను అమ్మింది.
వార్షిక ప్రాతిపదికన ఇది 95 శాతం ఎక్కువ. అమ్మకాల్లో చక్కని పనితీరు కనబరిచినందుకు తమ ఆదాయంలో వృద్ధి నమోదైందని ఇన్వెస్టో ఎక్స్ పర్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగంలో తమ నిబద్ధతకు, సృజనాత్మతకు ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ విశాల్ రహేజా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధమైన పని తరుతో ముందుకెళతామని పేర్కొన్నారు. ప్రస్తుతం లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని వివరించారు.