సాధారణంగా స్థలయజమానులు బిల్డర్లకు చుక్కలు చూపిస్తుంటారు. కానీ, కిస్మత్పూర్లో సీన్ రివర్స్ అయ్యింది. ఒక బిల్డర్ గురించి బాధితులుగా భావిస్తున్న భూయజమానులు తమ ఆవేదన, ఆక్రోశాన్ని ఎలా వెళ్లగక్కాలో తెలియక.. బిల్డర్‌కు వ్యతిరేకంగా ఒక కరపత్రాన్ని పంచిపెట్టారు. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. గత కొన్నేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరును సంపాదించుకున్న అశోకా బిల్డర్స్ చేసిన మోసాన్ని వివరిస్తూ.. భూయజమానుల శ్రేయోభిలాషి పేరిట విడుదలైన కర పత్రం హాట్ టాపిక్‌గా మారింది.
సోమవారం ఉదయం బస్ స్టాపులు, మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ పాంప్లెట్ ను ఎవరో పంచి పెట్టినట్లు సమాచారం. తెలుగులో టైప్ చేసిన ఈ పాంప్లెట్లో అశోకా బిల్డర్స్ మోసం గురించి ప్రస్తావించారు. ఈ సంస్థతో ఏ భూయజమాని అయిన జాగ్రత్తగా ఒప్పందం కుదుర్చుకోవాలని అప్రమత్తం చేశారు. అశోకా బిల్డర్స్ సంస్థ మోసకారి కంపెనీగా ఇందులో ప్రస్తావించారు. ఈ పాంప్లెట్ను చూశాక.. అశోకా బిల్డర్స్ గురించి.. వాస్తవాల్ని కనుగొనే ప్రయత్నాన్ని రెజ్ న్యూస్ చేసింది.
స్వర్గీయ జైవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు అశోకా బిల్డర్స్ అనే సంస్థను 1989లో ఆరంభించారు. కాకపోతే, కొన్నేళ్ల క్రితమే వీరు విడిపోయారు. జైవీర్ రెడ్డి మరణించిన తర్వాత అతని కుమారుడు జైదీప్ రెడ్డి అశోకా బిల్డర్స్ బాధ్యతల్ని చేపట్టారు. ఆయన నిర్మాణ రంగంలో ఎంతో చురుకుగా ఉంటూ.. ఇటీవల కూకట్ పల్లిలో ఒక బడా షాపింగ్ మాల్‌ను ఆరంభించారు. అశోకా బిల్డర్స్ సంస్థలో మరో కీలక వ్యక్తి అయిన.. లక్ష్మారెడ్డి తన కుమారుడైన ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి నార్త్ స్టార్ హోమ్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వినూత్నమైన ప్రాజెక్టుల్ని చేపడుతుందనే ఖ్యాతినార్జించింది.
మూడో వ్యక్తి అయిన విజయభాస్కర్ రెడ్డి అశోకా బిల్డర్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించేవారు. ఆయన మాతృక సంస్థ నుంచి బయటికొచ్చారు. కాకపోతే తను నేటికీ అశోకా బిల్డర్స్ పేరును వాడుకుంటున్నారు. అతని కుమారుడే ప్రస్తుతం ఏసీబీఎల్ సంస్థను నిర్వహిస్తున్నాడని సమాచారం. ఇదే సంస్థ బండ్లగూడలో ఒక ప్రాజెక్టును ఆరంభించేందుకు స్థల యజమానితో ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. మరి, భూయజమాని సంస్థ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. సోమవారం ఉదయమే అశోకా బిల్డర్స్‌కు వ్యతిరేకంగా.. బండ్లగూడ, కిస్మత్పూర్, స్థానిక మున్సిపల్ మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఈ కరపత్రం హల్చల్ చేస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం హైదరాబాద్ రియల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాంప్లెట్లో బాధితుడు అశోకా బిల్డర్స్ గురించి పదకొండు అంశాల్ని ప్రస్తావించారు. అవేమిటంటే..
- అశోకా బిల్డరు సంస్థ ఒక మోసకారి సంస్థ
- అశోకా బిల్డర్ దుర్మార్గపు సంస్థ.. భూయజమానులను నట్టేట ముంచే నిలువు దోపిడి చేసే సంస్థ.
- వాస్తవాలను తెర మరగున పెట్టే సంస్థ.
- అశోకా బిల్డరు నోటితో చెప్పడానికీ, నాన్ జ్యుడిషీయల్ స్టాంపు పేపర్‌పై రాసినదానికి పొంతన ఉండదు. ఆమడ దూరము- మోసమే.
- అశోకా బిల్డరు సంస్థ చేసేటి బిల్డర్- భూయజమాని అవగాహన ఒప్పందాలు కావు. కానీ, అవి భూయజమానులను అదఃపాతాళానికి అణగద్రొక్కే ఏకపక్ష, బిల్డరుకు అనుకూల నిర్ణయాలతో భూయమజాలను భయపెట్టి, బంధించి, బ్లాక్ మెయిల్ చేసే ఒప్పందాలు
- అశోకా బిల్డరు సంస్థ గౌరవ కోర్టులకు కూడా సమర్పించే పిటిషన్లలో పారదర్శకత, వాస్తవాలను దాచి, తప్పుదోవ పట్టించి, ఇది కోర్టు ఆర్డర్ అని భూయజమాని బ్లాకు మెయిల్ చేసే లక్ష్యము నెరవేర్చుకునే, భూయజమాని వాటా నుంచి కూడా దోచుకునే సంస్థ.
- అశోకా బిల్డరు న్యాయవాదులను తమ గుప్పిట్లో పెట్టుకునే న్యాయవ్యవస్థకు కూడా తూట్లు పొడిచే సంస్థ.
- అశోకా బిల్డర్ సంస్థ వాస్తవాలు లేని వాటిని కూడా వాస్తవాలు ఉన్నట్లు సృష్టించి, మోసగించే సంస్థ
- అశోకా బిల్డర్ సంస్థ పాలకులతో ముఖ్య పాలకులు, మానవత్వాన్ని మంటగలిపి, దొరికినంత దోచుకోవాలని, స్వార్థముతో దుర్భుద్దితో భూయజమానులను ముప్పు తిప్పలు పెట్టి తమ లక్ష్యము నెరవేర్చుకోవాలని పట్టుదల చాలా దురదృష్టకరం.
- భూయజమానులు అశోకా బిల్డర్ సంస్థలో అవగాహన ఒప్పందాలు, అగ్రిమెంట్లు చేసుకునే ముందు, అప్రమత్తంగా ఉండాలని, ఒక బాధితుడి ఒక హెచ్చరిక అని గుర్తించాలి.