Categories: TOP STORIES

అమ్మకాలు అదుర్స్

    • హైదరాబాద్‌లో గరిష్ట స్థాయిలో ఇళ్ల అమ్మకాలు
  • గతేడాది 12 శాతం వృద్ధితో 36,974 యూనిట్ల విక్రయాలు
  • 12 ఏళ్ల గరిష్టానికి హౌసింగ్ డిమాండ్
  • నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి

హైదరాబాద్ లో ఇళ్ల విక్రయాలు అదరగొట్టాయి. గతేడాది అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 2023తో పోలిస్తే 2024లో 7 శాతం మేర పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడైనట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్‌తోపాటు పుణెలో ఆల్‌టైమ్‌ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది.

‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్‌ నెలకొంది. రూ.2-5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేదు’ అని నివేదిక తెలిపింది. రూ.2-5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్‌ ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. ప్రీమియమైజేషన్‌ ధోరణి పెరిగిపోయిందని, మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారని వివరించారు. నగరాలవారీగా చూస్తే.. 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు 2023తో పోల్చితే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి. అహ్మదాబాద్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. కోల్‌కతాలో 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి. చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి.

This website uses cookies.