తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనల్ని సవరించింది. 2020 ఆగస్టు 26 కటాఫ్ తేదీ వరకు.. లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే.. అందులోని మిగతా ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశాన్ని కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు సంబంధించిన సహాయం కోసం హెచ్‌ఎండీఏ ప్రత్యేక కాల్‌సెంటర్ నంబరు 1800 599 8838 ను ఏర్పాటు చేసింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తుల పరిష్కారాన్ని పది రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. చెరువులు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలోని సర్వే నంబర్లలోని ప్లాట్లకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల శాఖలు పరిశీలించి పరిష్కరిస్తాయి. నిషేధిత జాబితా, నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలోకి వచ్చే సర్వే నంబర్లలోని ప్లాట్లు మినహా మిగతా ప్లాట్లకు.. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నోటీసులు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. ఆయా యజమానులు గడువులోగా ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. అయితే ఓపెన్ స్పేస్ ఛార్జీలను భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లిస్తామంటే మాత్రం.. వారికి 25 శాతం రాయితీ లభించదని గుర్తుంచుకోండి.
ఈ మేరకు వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో నిషేధిత జాబితా వివరాల పరస్పర బదిలీ, సాఫ్ట్‌వేర్ అనుసంధానం ప్రక్రియలను పురపాల శాఖ పూర్తి చేసింది. అర్హులైన దరఖాస్తుదారులు వెంటనే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్‌స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించినవారికి 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన తరువాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. 10 శాతం ప్రాసెసింగ్ ఛార్జీలు మినహాయించి, మిగతా మొత్తం వెనక్కు ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి, ఎల్ఆర్ఎస్ కింద 25.70 లక్షల ప్లాట్లను ఏకకాలంలో క్రమబద్ధీకరణ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తును మొదలుపెట్టింది. దీంతో నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు, ప్రజలకు ఊరట లభించిందని చెప్పొచ్చు.