రియల్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయ్యాక.. ఇంకేముంది, రియల్ రంగం నాలుగు పూవులు ఎనిమిది కాయలుగా వికసిస్తుందని బిల్డర్లంతా భావించారు. అప్పటివరకూ రియల్ రంగం పరుగులు పెట్టడమే చూసినవారంతా.. 2024లో హైదరాబాద్ రియల్ మార్కెట్ మొత్తం క్రాష్ కావడంతో.. ఏం జరుగుతుందో అర్థం కాక.. భవిష్యత్తులో ఏమవుతుందో తెలియక గగ్గోలు పెడుతున్నారు. అధిక శాతం మంది రియల్టర్లు.. ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయి.. అందులో నుంచి లేచే సాహసం చేయక.. పైకి లేచే ఓపిక లేక లబోదిబోమంటున్నారు. తమ పరిస్థితి ఎందుకిలా తయారైందో అర్థం కాక.. తామేం తప్పు చేశామో తెలియక.. ఇళ్లల్లో కిటికీలు మూసుకుని మరీ.. వెక్కివెక్కి ఏడ్చే పరిస్థితి దాపురించింది. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఇది ముమ్మాటికి నిజం.
* తెలంగాణ ఆవిర్భవించాక.. రియల్ రంగం గురించి ఏమాత్రం అనుభవం లేని సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. రియల్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఏకకాలంలో పదహారు జీవోలను ఇచ్చారు. అప్పటికే తెలంగాణ ఉద్యమంతో విసిగిపోయిన బిల్డర్ల భవితవ్యాన్ని గురించి ఆలోచించి.. ఆ రంగానికి ఊపిరి వస్తే.. ఎన్ని రంగాలు వృద్ధి చెందుతాయో ఆలోచించి.. ఎంతమందికి ఉపాధి లభిస్తుందో అర్థం చేసుకుని.. ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. దాని వల్ల బీఆర్ఎస్ పార్టీ 2016 జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల కోసమే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని.. అప్పటి ప్రతిపక్షాలు వాదించకపోలేదు. ఏదీఏమైనా, ఆతర్వాతే నిర్మాణ రంగం క్రమక్రమంగా గాడిలో పడింది.
* పదేళ్లయ్యాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రియల్ రంగంలో పండిపోయిన వ్యక్తి సీఎం అయ్యాక.. నిర్మాణ రంగం మరింత పరుగులు పెడుతుందని ఆశించారు. కాకపోతే సీన్ రివర్స్ కావడంతో వీరంతా తలలు పట్టుకుంటున్నారు. అధికారంలోక వచ్చాక రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.. అనే పెద్ద మనసుతో నిర్ణయాలు తీసుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ.. అవి తప్పు నిర్ణయాలని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందులో నుంచి బయట పడలేని నిస్సహాయ స్థితికి రియల్ రంగం వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొదట్లో హైడ్రా మంచిదే అనుకున్నారు.. కానీ, దాన్ని ప్రభావం మార్కెట్‌ను మొత్తం కుళ్లబొడుస్తుందని అమాత్యులే అనుకోలేదు. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో తప్పు చేస్తోంది. అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐపై ఆంక్షల్ని విధించాలనే ఆలోచనలు చేస్తున్నట్లు రియల్ మార్కెట్ మొత్తం కోడై కూస్తుంది. ఒకవేళ, ఇదే జరిగితే.. హెచ్ఎండీఏ వేలం పాటలో పాల్గొనేందుకు ఎవరు ముందుకొస్తారు? హెచ్ఎండీఏ వేలం వేస్తే ఎంతమంది ప్లాట్లను కొనుగోలు చేస్తారో.. ఔత్సాహికులైన పురపాలక శాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకే తెలియాలి.
* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలైంది. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఇద అక్షరాల సత్యం. ఇప్పట్లో అభివృద్ధి చెందుతున్న నమ్మకమైతే ఎవరికీ లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులున్న తరుణంలో, అపరిమిత ఎఫ్ఎస్ఐపై ఆంక్షల్ని విధించే పరిస్థితిలో.. కోకాపేట్, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో వేలం వేస్తే.. భూముల్ని కొనడానికి ఎవరు ముందుకొస్తారు? ఎఫ్ఎస్ఐపై ఉన్నపళంగా ఆంక్షలు విధిస్తే.. ఆకాశహర్మ్యాల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న బిల్డర్లు, డెవలపర్లు ఏమైపోవాలి? ఆకాశహర్మ్యాల అనుమతి కోసం వేచి చూస్తున్నవారి పరిస్థితి ఎంత దారుణంగా తయారౌతుంది? మొత్తానికి, కర్ణుడి చావుకి లక్ష కారణాలైనట్లు.. హైదరాబాద్ రియల్ రంగం దెబ్బతినడానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరియే ఏకైక కారణమని ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే.. మార్కెట్ మరింత దిగజారిపోతుంది. అయినా కూడా మొండివైఖరితో హెచ్ఎండీఏ వేలం వేస్తే.. అది కాస్త తుస్సుమని.. ఆ వార్త దేశమంతటా వ్యాపించి.. కాంగ్రెస్ పరువు పోవడం ఖాయమని నిర్మాణ రంగంతో ముడిపడిన ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు.