Categories: TOP STORIES

విలాస ఇళ్లు.. డిమాండ్ ఫుల్

లగ్జరీ ఇళ్లకు కొనసాగుతున్న డిమాండ్

సీబీఆర్ఈ నివేదిక వెల్లడి

దేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. మెరుగైన సౌకర్యాలు, మరింత విశాలమైన నివాస ప్రాంతాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా సంపన్న కొనుగోలుదారులు లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. పలువురు ధనిక కొనుగోలుదారులు బంగ్లా కంటే ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద అపార్ట్ మెంట్లను కొనడానికి ఇష్టపడుతున్నారని సీబీఆర్ఈ తాజా నివేదిక వెల్లడించింది. దేశీయ పెట్టుబడిదారులే కాకుండా ఎన్నారైలు కూడా లగ్జరీ నివాసాలకే మొగ్గు చూపిస్తుండటంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ ఫుల్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో అనేక మంది డెవలపర్లు అధిక విలువ కలిగిన వ్యక్తుల అవసరాలు తీర్చడానికి అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇప్పటికే తక్కువ సరఫరా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల ధర రూ.5 కోట్లకు పైగా పెరిగిందని రియల్ నిపుణులు చెబుతున్నారు.

డీఎల్ఎఫ్ ఇటీవలే దాని 17 ఎకరాల సూపర్-లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ది డహ్లియాస్ డీఎల్ఎఫ్-5, గురుగ్రామ్ వద్ద రూ.80 కోట్ల కంటే ఎక్కువ ధరతో ప్రీ-లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో కంపెనీ దాదాపు 420 అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో అపార్ట్ మెంట్ కనీస పరిమాణం 10,300 చదరపు అడుగులు. నోయిడాలో కూడా ఇటీవల లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుల ధరలు భారీగా పెరిగాయి. సెక్టార్ 115లోని కౌంటీ గ్రూప్ ప్రాజెక్ట్ అపార్ట్ మెంట్లు రూ.9 కోట్ల నుంచి రూ.13 కోట్ల పరిధిలో ఉన్నాయి. అపార్ట్ మెంట్ల పరిమాణం 4700 చదరపు అడుగుల నుంచి 7వేల చదరపు అడుగుల వరకు ఉంటుంది. గౌర్స్ గ్రూప్ కంపెనీ ఇటీవలే ఘజియాబాద్‌లో రూ.3,100 కోట్ల విలువైన లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును ప్రారంభించగా.. కేవలం మూడు రోజుల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి.

విలాసవంతమైన హౌసింగ్ సెగ్మెంట్‌లో రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్లు అధిక డిమాండ్ కారణంగా జనవరి-సెప్టెంబర్ 2024 కాలంలో దాదాపు 37.8 శాతం మేర వార్షిక అమ్మకాలు పెరిగాయని సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ3 పేరుతో విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ కాలంలో లగ్జరీ యూనిట్ల మొత్తం విక్రయాలు 12,625 యూనిట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో ఇది 9,160 యూనిట్లుగా ఉంది. క్వాంటం లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్ అమ్మకాల పరంగా ఢిల్లీ సుమారు 5,855 యూనిట్ల అమ్మకాలతో 72 శాతం వార్షిక వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. 18 శాతం వార్షిక వృద్ధితో, 3,820 యూనిట్లతో ముంబై రెండో స్థానంలో నిలిచింది.

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో, అగ్ర నగరాల్లోని లగ్జరీ హౌసింగ్ విభాగం విక్రయాలలో 82 శాతం మేర వార్షిక వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 2,390 యూనిట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మొత్తం 4,360 లగ్జరీ హౌసింగ్ యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ త్రైమాసికంలో ఢిల్లీ, ముంబైతో సహా పలు నగరాలు ఇళ్ల అమ్మకాల్లో ఆధిపత్యం చెలాయించాయి.

This website uses cookies.