త్రైమాసిక నివేదికలను సమర్పించనందుకు 388 రియాల్టీ ప్రాజెక్టులను మహారాష్ట్ర రెరా అథారిటీ సస్పెండ్ చేసింది. రెరా నిబంధనల ప్రకారం రెరాలో నమోదైన ప్రతి కంపెనీ మూడు నెలలకోసారి ప్రాజెక్టుకు సంబంధించిన తాజా విశేషాల్ని రెరా వెబ్‌సైటులో పొందుపర్చాలన్నది నిబంధన. ఆయా త్రైమాసికంలో ఎన్ని అపార్టుమెంట్లను విక్రయించారు.. ఆయా అమ్మకాలతో ఎంత సొమ్ము వచ్చింది.. మూడు నెలల్లో నిర్మాణం కోసం చేసిన ఖర్చెంత.. ప్రాజెక్టులో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? వంటి వివరాల్ని తప్పనిసరిగా పొందుపర్చాలి.
మహారాష్ట్ర రెరా 2023 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన తాజా విశేషాల్ని రెరా వెబ్‌సైటులో పొందుపర్చాలని సుమారు 750 మంది డెవలపర్లకు నోటీసును పంపించింది. అందులో కేవలం మూడు సంస్థలే పూర్తి వివరాల్ని రెరాలో నమోదు చేశాయి. దీంతో ఆగ్రహించిన మహారెరా సుమారు 388 సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్య్వుల్ని జారీ చేసింది.
ఇటీవల తెలంగాణ రెరా అథారిటీ కూడా త్రైమాసిక నివేదికలను సమర్పించాలని ప్రమోటర్లను ఆదేశించింది. మరి, ఇందులో ఎంతమంది నమోదు చేస్తారో? ఎన్ని ప్రాజెక్టుల మీద వేటు వేస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది.