Categories: AREA PROFILE

కాప్రా-ఈసీఐఎల్ వైపు మధ్యతరగతి చూపు..

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధోరణి క్రమంగా మారుతోంది. మొన్నటి వరకు ప‌శ్చిమ‌ హైదరాబాద్ వైపు మంచి జోరు మీద ఉన్న నిర్మాణ రంగం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా కోకాపేట, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తరహాలోనే గ్రేటర్ సిటీలోని శివారు ప్రాంతాల్లో భారీ నివాస, వాణిజ్య నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. దీంతో సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లు హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామిక హబ్‌గా పేరుగాంచిన కాప్రా, ఈసీఐఎల్‌ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఐసీఐఎల్, అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎఫ్‌సీ), హిందుస్థాన్‌ కేబుల్‌ కంపెనీ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసర్చ్‌ (టీఎఫ్‌ఐఆర్‌) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కారణంగా ఈ ప్రాంతం ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది.

చర్లపల్లి, కుషాయిగూడ, మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లో నెలకొన్న పరిశ్రమలతో ఈ ప్రాంతం భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలిచ్చే ప్రాంతంగా మారిపోయింది. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి కావడంతో భూముల రేట్లు పెద్ద ఎత్తున పెరిగాయి. కాప్రా, ఈసీఐఎల్ వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇంటి స్థలాలు దొరకడం కష్టం అయింది. నివాసయోగ్యమైన ప్రాంతం కావడంతో పాటు ఇంటి స్థలాలు అత్యంత ఖరీదు కావడంతో అపార్ట్ మెంట్స్ లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, షాపింగ్‌ మాల్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్స్, మెరుగైన కనెక్టివిటీ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా కూత వేటు దూరంలో చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివిధ జిల్లాల వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. దీంతో కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతం అంటే దేశంతో పాటు విదేశాల్లో ఉన్న వారికి సైతం సుపరిచితం. ఈ నేపథ్యంలో ఇక్కడ రియల్‌ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఈసీఐఎల్‌-ఏఎస్ రావునగర్‌-సైనిక్‌పురి ప్రధాన రహదారి, ఈసీఐఎల్‌-ఎస్పీనగర్‌-మౌలాలీ రేడియల్‌ రోడ్డు, ఈసీఐఎల్‌-కుషాయిగూడ-చక్రీపురం-కీసర రేడియల్‌ రోడ్డు ఆయా రహదారుల వెంట ప్రాంతాన్ని బట్టి స్థలాలు గజానికి లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు పలుకుతోంది. కాప్రా, సైనిక్‌ పురి, ఈశ్వరపురి, హైటెన్షన్‌ లైన్, కుషాయిగూడ, కమలానగర్, ఎస్పీనగర్, మౌలాలీ ప్రాంతాల్లో గజం 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది. గృహ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది అపార్ట్ మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డిమాండ్‌ ఉన్న ప్రాంతం కావడంతో బ్యాంకు రుణాలు సైతం సులభంగా లభిస్తున్నాయి.
కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతంలో ఫ్లాట్‌ కొన్నవారు తిరిగి అమ్మాలనుకున్నా ధర బాగి పలికి మంచి లాభాలు వస్తున్నాయని రియల్ రంగ మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ అపార్ట్ మెంట్ లో ప్లాట్లు ప్రాంతం, ప్రాజెక్టును హట్టి చదరపు అడుగు 4,000 నుంచి 7,000 వరకు పలుకుతోంది. వసతులు, ఆధునిక హంగులతో నిర్మాణం జరుపుకుంటున్న ప్రీమియం ప్రాజెక్టుల్లోని ఫ్లాట్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ ప్రాంతంలో కొన్ని నిర్మాణ సంస్థలు, కొందరు బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లు పెట్టి మరీ అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్స్ ను మార్కెట్‌ చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఫ్లాట్ 60 లక్షల్లో లభిస్తుండటంతో మధ్య తరగతి వాళ్లు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతం వైపు మొగ్గుచూపుతున్నారు. అందుకు అనుగునంగా ఇంటి కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ప్లాట్ల నిర్మాణంలో మార్పులు చేస్తూ.. ఆధునిక డిజైన్లు, సకల సౌకర్యాలతో నివాస ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు.

This website uses cookies.