నాగార్జున హోమ్స్ అధినేత నాగరాజు.. మీకు ఇది తగునా?
క్లబ్ హౌస్ లో సౌకర్యాల్ని పొందుపరుస్తానని మాటిచ్చి..
ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని వీటిని పూర్తిగా నిలిపివేశారు..
ఇది ఎంతవరకూ కరెక్టు? ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలి!
సమాజంలో మంచి గౌరవం, హోదా ఉన్న బిల్డర్లు ఎందుకో కానీ కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. అపార్టుమెంట్‌ను నిర్మించే సమయంలో.. కొనుగోలుదారులతో మంచిగా మాట్లాడే డెవలపర్లు.. తీరా బయ్యర్లకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ఏదో ఒక మెలిక పెడుతుంటారు. ప్రణీత్ డెవలపర్స్ అధినేత బాచుపల్లిలోని ఒక ప్రాజెక్టు విషయంలో.. కొనుగోలుదారులకు అందించాల్సిన క్లబ్‌హౌజ్‌లో ఒక అంతస్తు అదనంగా కట్టి.. తన కార్యాలయంగా వినియోగించుకునే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడి ఇంటి బయ్యర్లు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాజాగా, నగరానికి చెందని మరో బిల్డర్ ఇలాగే వ్యవహరిస్తున్నారని.. కొనుగోలుదారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
* హైదరాబాద్‌కు చెందిన నాగార్జున హోమ్స్ అధినేత పి.నాగరాజు కొంపల్లిలో.. నాగార్జున డ్రీమ్‌ల్యాండ్ అనే అపార్టుమెంట్‌ను నిర్మించారు. అందులో ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని.. ఆధునిక సౌకర్యాలతో పిల్లాపాపలు సంతోషంగా గడుపుతారని కొనుగోలుదారులు తొలుత భావించారు. ఆరు బ్లాకుల్లో 280 వరకూ కుటుంబాలు ఇప్పటికే నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, ఫ్లాట్లను అమ్మేటప్పుడు.. కమ్యూనిటీలోనే సూపర్ మార్కెట్, వ్యాయామ శాల, సెలూన్, ఈత కొలను, క్లబ్ హౌస్ వంటి అదనపు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని మాటిచ్చారు. అయితే, ఆ మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆర్థిక నష్టం వాటిల్లుతుందనో.. లేక ఏ కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్ల నుంచి నాగార్జున డ్రీమ్ ల్యాండ్‌లో ఆధునిక సౌకర్యాల్ని పూర్తిగా నిలిపివేశారు.
* సూపర్ మార్కెట్ వంటి అన్ని సౌకర్యాలు పూర్తిగా నిలిపివేసి వాటిని నిరుపయోగంగా ఉంచారు. క్లబ్ హౌస్‌ని గోదాముగా వినియోగించడానికి ప్రయత్నించారు. అది నిబంధనలకు విరుద్ధంగా అపార్టుమెంట్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసినా నాగరాజు మొండి వైఖరీని వీడటం లేదు. ఇళ్ల కొనుగోలుదారులతో ఘర్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. అతనికి సంబంధించిన సరుకులను, ఇతర సామగ్రితో క్లబ్‌హౌజ్‌లో భద్రపరిచే ప్రయత్నం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంఘ సభ్యులు ఎంత ప్రయత్నించినా.. బిల్డర్ నాగరాజు నిర్లక్ష్య ధోరణీతో వ్యవహరిస్తున్నారు. అతని మొండివైఖరికి నిరసనగా.. అపార్టుమెంట్లో నివసించే కుటుంబాలన్నీ కలిసి.. క్లబ్ హౌస్ కావాలంటూ ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
* వారం రోజుల క్రితం నాగరాజుకు సమాచారం ఇచ్చినా.. ఆయన చివరి క్షణంలో సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో, ఆయన మీద తమకు సందేహాలను మరింత పెరిగాయని డ్రీమ్ ల్యాండ్ సంఘసభ్యులు, ఇంటి కొనుగోలుదారులు అంటున్నారు. సంఘ సభ్యులందరూ ఒక్క తాటి పై నిలిచి.. ఈ సమస్య పరిష్కారానికి న్యాయ పరమైన అవకాశాల గురించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమాజంలో హోదా, మంచి గౌరవం ఉన్న నాగరాజు.. హుందాగా వ్యవహరించి.. ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలని.. నాగార్జున డ్రీమ్ ల్యాండ్ యాజమాన్య సంఘ ప్రతినిధులు ఒక ప్రకటన లో తెలిపారు.