- శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ వి. కృష్ణారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ
- మెరుగ్గా హైదరాబాద్ సెంటిమెంట్
- హైఎండ్ ఫ్లాట్లలో స్థిరంగా అమ్మకాలు
- ఏడాది చివర్లో 2 ప్రాజెక్టులు హ్యాండోవర్
- కోకాపేట్‌లో కొత్తగా డ్యూప్లే ఫ్లాట్ల ప్రాజెక్టు
‘హైదరాబాద్ లగ్జరీ గృహాలకు గిరాకీ ఎప్పటికీ ఉంటుంది. దీనికి సాధారణ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితులతో సంబంధం ఉండదు. అందుకే, మేం ఎక్కువగా లగ్జరీ గృహాల్ని కట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ క్రమంలో కొత్తగా కోకాపేట్‌లో ఐదు ఎకరాల్లో హైఎండ్ లగ్జరీ ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం. ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. 9,999 చదరపు అడుగుల్లో డ్యూప్లే ఫ్లాట్లను డిజైన్ చేశామ’ని శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ వి.కృష్ణారెడ్డి తెలిపారు. 2022 ప్రథమార్థంలో హై ఎండ్ ఫ్లాట్ల అమ్మకాలు, ప్రస్తుత ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనల గురించి ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హై ఎండ్ గృహాలు కొనేవారూ ఎప్పుడూ ఉంటారు. వీరికి సాధారణ పరిస్థితులతో సంబంధం ఉండదు. పైగా, అధిక శాతం మంది స్థిర నివాసం కోసం ప్రాధాన్యతనిస్తారు. కొందరేమో తమ పిల్లల కోసమో, రిటైర్మెంట్ తర్వాత నివసించడానికో కొంటుంటారు. ఇలాంటి వారంతా ఎక్కువగా స్పెషలైజ్డ్ ప్రాజెక్టుల మీదే ఫోకస్ పెడుతుంటారు.
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. మేం కొంతకాలం నుంచి హాట్ లొకేషన్లలో.. హైఎండ్ లగ్జరీ ఫ్లాట్లను కట్టేందుకు దృష్టి సారిస్తున్నాం. ఇక 2022 ప్రథమార్థంలో హైదరాబాద్ రియల్ రంగంలో అమ్మకాల విషయానికి వస్తే.. స్థిరంగా ఉన్నాయని చెప్పొచ్చు. భాగ్యనగరంలో రియల్ సెంటిమెంట్ మెరుగ్గా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించొచ్చు.
ఏడాది చివర్లో హ్యాండోవర్..
రాజ్ భవన్ రోడ్డు నిర్మిస్తోన్న ప్రాజెక్టులో అమ్మకాలు పూర్తయ్యి ఆరు నెలలు దాటింది. కొనుగోలుదారులకు పొజిషన్ ఇవ్వడానికి మరో ఏడాది గడువుంది. అయినా ఈ ఏడాది చివర్లోనే బయ్యర్లకు ఇంటీరియర్స్ నిమిత్తం ఫ్లాట్లను అందజేస్తున్నాం. కోకాపేట్ లగ్జరీ ప్రాజెక్టులో స్ట్రక్చర్ పూర్తి కాకుండానే.. దాదాపు ఎనభై శాతం అమ్ముడయ్యాయి. మోకిలా విల్లా ప్రాజెక్టు ఫుటింగ్స్ స్థాయిలోనే 80 శాతం అమ్మేశాం. బంజారాహిల్స్ హై ఎండ్ ప్రాజెక్టు కూడా ఈ ఏడాది చివర్లో హ్యండోవర్ చేస్తాం.
ఇప్పటికే 75 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. కొత్తగా కోకాపేట్‌లో ఐదు ఎకరాల్లో సరికొత్త ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నాం. ఇందులో ఫ్లాట్ల విస్తీర్ణం.. 5,555.. 6,666 చదరపు అడుగుల్లో, ఫ్లోరుకు రెండు ఫ్లాట్లే ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణగా డ్యూప్లే ఫ్లాట్లను డిజైన్ చేశాం. వీటి విస్తీర్ణం.. 9,999 చదరపు అడుగులు ఉంటుంది.