మా తల్లిదండ్రులు సమానమైన అవకాశాల్ని కల్పించారు. విదేశాల్లో చదివినా వ్యాపారం నిర్వహించడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ప్రోత్సాహాన్ని అందించారు. అయితే, నిర్ణయాల్ని తీసుకునే సమర్థత వచ్చిందని కస్టమర్లు, సప్లయర్లకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. కొందరు వెండార్లయితే మీదే తుది నిర్ణయమా? ఇంకా మీపై ఎవరైనా ఉన్నారా? అని సందేహంగా అడిగేవారు. అంటే, అన్ని కోట్లకు సంబంధించిన నిర్ణయాలు ఒక అమ్మాయి తీసుకుంటుందా? అనేది వారి ప్రధాన సందేహం. సరఫరాదారులు ఈమెయిళ్లు పంపినప్పుడూ డియర్ సర్ అని సంబోధిస్తుంటారు. సంస్థను నడిపే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చనే విషయం వీళ్లకు అర్థమవ్వడానికి ఎంతో కాలం పట్టదని కచ్చితంగా చెప్పగలను.
– చైత్ర చెరుకు, సీవోవో, ఆర్‌వీ నిర్మాణ్
ఈ పురుష ఆధిక్య రంగంలో స్తీలకు వారసత్వంగా వచ్చిన నాయకత్వం సులభమేమీ కాదు. ఏదీ ఒక గోల్డ్ ప్లేట్ లో పెట్టి రాదు. దూరపు కొండలు నునుపు అని అందరు అనుకున్నట్లుగా ఉండదు. ఒక టీం బిల్డ్ చేయడంలో, అదీ కస్టమర్ కేర్, సేల్స్ వంటి విభాగాల్ని అర్థం చేసుకోవడంలో మహిళలకు గల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపకరిస్తుంది. 2022లో ఇంటర్నెట్లో అత్యంత ఎక్కువగా శోధించిన పదం.. విమెన్. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా స్తీలు లీడర్లుగా ఎదగడం, ఉద్యమించడం చూస్తూనే ఉన్నాం. రియల్ రంగంలోనూ మహిళలు సత్తా చాటుతారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆర్క్ గ్రూప్ నాయకత్వ బాధ్యతల్ని తీసుకున్న కొత్తలో ఒక సందేహం కలిగేది. రియాల్టీ రంగం, ఉద్యోగులు, వెండార్లు, గుత్తేదారులు వంటివారు.. నా తండ్రిని ఆమోదించినట్లు.. నన్ను, నా నిర్ణయాల్ని అంగీకరిస్తారా? గౌరవిస్తారా? అనే సందేహం ఉండేది. మొదట్లో అందరూ నా హోదాను బట్టి గౌరవించినా.. ప్రాజెక్టు ఆరంభించే ముందు జరిగే రిసెర్చ్, మీటింగుల్లో ఐడియాస్ షేర్ చేసుకోవడం, సైట్ విజిట్లు కలిసి వెళ్లడం, వారితో కలిసి భోజనం చేయడంతో పాటు పనిలో పూర్తిగా లీనం కావడం వల్ల.. ఫలితాలు కొత్తగా రావడంతో ప్రతిఒక్కరికీ అసలు విషయం అర్థమైంది. కేవలం వారసత్వంగా వచ్చిన నాయకత్వం కాదని, ఫలితాలు రావడంలో మేనేజ్మెంట్ పాత్ర ఐదు శాతమే ఉంటుందని.. గ్రౌండ్ లెవెల్లో 95 శాతం పని చేస్తేనే ఫలితం లభిస్తుందని ఉద్యోగులు, కన్సల్టెంట్లకూ తెలిసొచ్చింది. వీరు సమస్యతో వచ్చినప్పుడు పరిష్కరిస్తే వారిలో విశ్వాసం ఏర్పడుతుంది.
– మేఘన గుమ్మి, సీఈవో, ఆర్క్ గ్రూప్
This website uses cookies.