– గోపనపల్లి వెస్ట్రన్ గెలాక్సీ రియల్టర్ కు టీజీ రెరా ఉత్తర్వులు
ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించడంలో జాప్యం చేసినందుకు హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ పై తెలంగాణ రెరా కన్నెర్రజేసింది. వెంటనే కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని వెస్ట్రన్ గెలాక్సీ అనే కమర్షియల్ ప్రాజెక్టుపై దాఖలైన తొమ్మిది వేర్వేరు కేసులను విచారించి ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 11 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టంచేసింది. గోపనపల్లిలో ఈ ప్రాజెక్టులో కమర్షియల్ యూనిట్లను పలువురు కొనుగోలు చేశారు. 2022 జనవరి 26న ఇందుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. 2024 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగిస్తామని ఒప్పందంలో రాసుకున్నారు. ఒకవేళ ఏదైనా జాప్యం జరిగిన చదరపు అడుగుకు నెలకు రూ.75 చొప్పున అద్దె చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొనుగోలుదారుల పేర్ల మీద కొల్లేటరల్ ప్లాట్ ను రిజిస్టర్ చేశారు. కమర్షియల్ యూనిట్ డెలివరీ చేసిన నాడు ఆ ప్లాట్ తిరిగి ఇవ్వాలని క్లాజ్ పెట్టుకున్నారు. అయితే, నిర్దేశిత సమయంలోగా సంస్థ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు కొనుగోలుదారులు తెలంగాణ రెరాను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన రెరా.. 90 రోజుల్లోగా కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని రియల్టర్ ను ఆదేశించింది. అలాగే ఆ మొత్తం అందుకున్న తర్వాత కొల్లేటరల్ ప్లాట్ ను కంపెనీకి తిరిగివ్వాలని కొనుగోలుదారులకు సూచించింది.
This website uses cookies.