పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిలు ఈమధ్య ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్న విషయం తెలిసిందే. ఒకానొడ సందర్భంలో మల్లారెడ్డిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ రేవంత్ రెడ్డి ఏకీపారేశాడు. అయితే, వారి గొడవ విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయ నాయకులకే కాదు.. దాదాపు సమాజంలో ఉన్న ప్రతిఒక్కరికీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే చాలా చిన్నచూపు అయిపోయింది. షేర్ల లావాదేవీల్ని నిర్వహించే వ్యక్తిని షేర్ మార్కెట్ బ్రోకర్ అంటారు.. అదేవిధంగా, రియల్ ఎస్టేట్ అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించే వ్యక్తిని రియల్ బ్రోకర్ అని అనడం సహజమే. బ్రోకర్ అనే పదం అంటే అదేదో సమాజ వ్యతిరేక కార్యకలాపాల్ని నిర్వహించే వ్యక్తి అన్నట్లుగా ముద్ర వేయడం కరెక్టు కాదు. ఎందుకో తెలుసా?
అన్ని వృత్తుల్లోకల్లా.. ఎక్కువసార్లు నో అని తిరస్కరణకు గురయ్యే వృత్తి.. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ. దాదాపు యాభై మందిలో 49 మంది నో అని చెప్పినా పట్టువిడవకుండా స్థిరాస్తిని అమ్మడానికి ప్రయత్నించే వ్యక్తి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పొచ్చు. వాస్తవానికి, ఇన్నిసార్లు నో చెప్పించుకున్న తర్వాత చాలామంది ఆయా వృత్తిని వదిలేస్తారు. కానీ, రియల్ ఎస్టేట్‌ని వృత్తిగా తీసుకున్నవారు.. ఒక్కసారి అందులోకి అడుగుపెడితే ఎక్కువ శాతం వదిలిపెట్టరు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారే తప్ప వెనకడుగు వేయనే వేయరు. ఎందుకంటే, వీరిని మొదట్లో తిట్టుకున్న వ్యక్తే.. తర్వాత తప్పకుండా పొగుడుతారు. ఎలాగో తెలుసా?
ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఒక మహిళ బిల్డర్ వద్ద 3 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన సొమ్ము చెల్లించేటప్పుడు.. సదరు డెవలపర్‌కి ఒక వ్యక్తి ఫోటో చూపెట్టిందావిడ. ఇతను రియల్ ఎస్టేట్ బ్రోకర్.. మీకేమైనా తెలుసా అని ప్రశ్నించింది. ఎందుకు మేడం? ఏమైనా ఇబ్బంది ఉందా? అని సదరు డెవలపర్ ప్రశ్నించగా.. ఆమె ఫ్లాటు కొనడానికి గల కారణాల్ని వివరించింది. ‘‘ దశాబ్దంన్నర క్రితం అనుకుంటా.. చదరపు గజానికి రూ.1000 చొప్పున ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థలం కొనిపించాడు. నేను వద్దని యాభై సార్లు చెప్పినప్పటికీ.. పట్టువదలకుండా నా వెంబడి పడి ఈ ప్లాటు కొనిపించాడు. అప్పుడతనికి పెద్దగా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో గజం యాభై వేలు దాటేసింది. అతను కొనిపించిన స్థలాన్ని ప్రస్తుతం విక్రయించి మీ దగ్గర ఫ్లాటు కొన్నాను. అతను కనిపిస్తే కొంత డబ్బు ఇద్దామని అనుకుంటున్నా’’ అని వివరించింది. దీంతో, డెవలపర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
<div class=”point”>కాబట్టి, రియల్ ఎస్టేట్ వృత్తిని నిర్వహించేవారిని ఎప్పుడు చిన్నచూపు చూడకూడదు. ప్రస్తుతం తక్కువ రేటుకు మన చేతిలో వాళ్లు కొనిపించిన ప్లాటే కొన్నాళ్ల తర్వాత లక్షలై కూర్చుంటుంది. కొందరు ఆ ప్లాటుతో పిల్లల పెళ్లిళ్లు చేస్తే.. మరికొందరు పిల్లలకు ఉన్నతవిద్యను చెప్పించేందుకు ఆయా ప్లాటును వినియోగిస్తారు. ఇంకొందరేమో అందులోనే ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా నివసించేందుకు ప్రయత్నిస్తారు. మొత్తానికి, మనకు తెలియకుండానే.. ఆర్థికంగా ఎంతో ప్రయోజనాన్ని కలిగించే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్. అందుకే, ఈ వృత్తిని స్వీకరించినవారికి సమాజం మర్యాద ఇచ్చేందుకు.. ఇక నుంచి బ్రోకర్ బదులు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అని పిలుద్దాం. అమెరికాలో మాజీ అధ్యక్షుడు కూడా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనే విషయాన్ని మర్చిపోకండి. ఆయన నిర్వహించే సంస్థ రియల్ ఎస్టేట్ సేవల్ని కూడా అందిస్తుందని గుర్తుంచుకోండి.</div>