తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఝలక్ ఇస్తుందా? ఇప్పటికే హైడ్రాతో పాటు వివిధ కారణాల వల్ల తగ్గుముఖం పట్టిన నిర్మాణ రంగానికి.. మరో షాక్ తగలనుందా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిసింది. కాకపోతే, దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గమేమో ఎఫ్ఎస్ఐపై నియంత్రణ విధించాలని గట్టిగా వాదిస్తోంది. మరో వర్గమేమో ఎఫ్ఎస్ఐపై నియంత్రణ విధిస్తే.. హైదరాబాద్‌కు గల ప్రత్యేకతను కోల్పోతుందని అంటున్నారు. కాకపోతే, ఈ రెండు ఆలోచనల బదులు.. 2019లో కేటీఆర్ ప్రవేశపెట్టిన జీవో నెం 50ని రద్దు చేస్తే.. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎలాగో తెలుసా?
దివంగత సీఎం వైఎస్సార్ ప్రభుత్వం 2006లో జీవో నెం 86కు ఆమోదముద్ర వేశారు. అపరిమిత ఎఫ్ఎస్ఐకు ఆ జీవో ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఆతర్వాత 2012లో ఆ జీవోకు కాస్త మెరుగులు దిద్దారు. మీటర్ ఎత్తు నుంచి 55 మీటర్ల హైట్ వరకు 16 మీటర్ల సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన అందులో ఉంది. అయితే, 55 మీటర్లు దాటిన తర్వాత పెరిగే ప్రతి ఐదు మీటర్లకు.. అదనంగా 0.5 మీటర్ల సెట్ బ్యాక్‌ను వదలాలనేది నిబంధనను పొందుపరిచారు. అంటే, ఎవరైనా 55 మీటర్ల కంటే అధిక ఎత్తులో అపార్టుమెంట్‌ను కట్టాల్సి వస్తే.. కింది నుంచి 0.5 మీటర్ల చొప్పున సెట్‌బ్యాక్‌ను వదలాల్సి వచ్చింది. ఫలితంగా, బిల్డర్లకు పెద్దగా కలిసొచ్చేదేమీ కాదు. అందుకే, ఒకట్రెండు శాతం మినహా అధిక శాతం బిల్డర్లు 20 అంతస్తుల్లోపే అపార్టుమెంట్లను నిర్మించేవారు.