ఇజ్రాయెల్-హమాస్ పోరుతో భారత్ వైపు ఎన్నారైల మొగ్గు

  • అక్కడి ప్రాపర్టీలు అమ్మేసి మనదేశంలో పెట్టుబడులకు నిర్ణయం

ఇజ్రాయెల్-హమాస్ పోరు భారత రియల్ రంగానికి ఓ రకంగా లబ్ధి చేకూరుస్తోందని రియల్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఘర్షణలు, అస్థిరతతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా ప్రాంతంతోపాటు యూఎస్, యూరోపియన్ మార్కెట్ల కంటే భారత మార్కెట్ తమ మూలధనానికి తగిన రక్షణ కల్పిస్తుందని ఎన్నారైలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఎన్నారైలు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దుబాయ్ లో నివసిస్తున్న సల్మాన్ ఖురేషి 2017లో ఓ ప్రాపర్టీని రూ.11 కోట్లకు కొన్నారు. దానిని తాజాగా రూ.13.5 కోట్లకు విక్రయించారు. ‘దుబాయ్ లో ప్రాపర్టీ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. నేను మరికొంత సమయం వేచి ఉంటే కనీసం మరో 40 శాతం అదనంగా ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియా మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాపర్టీని అమ్మేసి బెంగళూరులో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వివరించారు.

రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలతోపాటు అక్కడి అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల కారణంగా దుబాయ్ లోని ఎన్నారైలు బెంగళూరు, పుణె, హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎన్నారై ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కూడా 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలు, రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదల కారంగా మార్పిడి రేటు తక్కువగానే ఉందని బ్లూమ్ బర్గ్ నివేదిక పేర్కొంది. బెంగళూరులో ఎన్నారైల పెట్టుబడులు ప్రధానంగా దుబాయ్ తోపాటు యూఏఈ, యూఎస్, యూకే వంటి పశ్చిమాసియా దేశాల నుంచి వస్తాయని అనరాక్ గ్రూప్ బెంగళూరు హెడ్ ఆశిష్ శర్మ తెలిపారు. దుబాయ్ నుంచి భారత్ లోకి 2018 నుంచి 2022 వరకు 2.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, గతేడాది 565 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలామంది ఎన్నారైలు దుబాయ్, బహ్రెయిన్ వంటి ప్రాంతాలపై ఆసక్తి కనబరిచారని.. ఇప్పుడు పశ్చిమాసియా పరిస్థితులు అస్థిరంగా ఉండటంతో భారత వైపు మొగ్గు చూపిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతీయ మైక్రో మార్కెట్టు దీర్ఘాకాలిక పెట్టుబడులకు అనువుగా ఉండటమే కాకుండా వారి మూలధనానికి మెరుగైన రక్షణ ఇవ్వడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘భారత్ లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఎన్నారైలు బెంగళూరులో రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇన్వెస్ట్ చేస్తారు. అదే దుబాయ్ లో అయితే రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు పెట్టుబడి పెడతారు.
దుబాయ్ లో అద్దె ఆదాయం ఏటా 8 శాతం వరకు పెరుగుతుంది. బెంగళూరులో అది 3 నుంచి 3.5 శాతమే ఉంటుంది. అయితే, బెంగళూరులో మూలధన విలువ 8 నుంచి 12 శాతం పెరుగుతుంది. దుబాయ్ లో అది 12 నుంచి 15 శాతం పెరుగుతుంది’ అని ఓ నిపుణుడు విశ్లేషించారు. దుబాయ్ లో గత ఆరు నెలల్లో 15 నుంచి 18 శాతం మేర ప్రాపర్టీ ధరలు పెరిగాయి. డౌన్ టౌన్ ప్రాంతంలోని కొన్ని ప్రైమ్ ప్రాపర్టీల్లో 30 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నందున అక్కడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. అక్కడ సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.1.8 కోట్ల వరకు ఉండగా.. డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ధర రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది.

This website uses cookies.