Categories: Celebrity Homes

కళాత్మకతతో పరిపూర్ణ ఆనందం

  • నా హాలిడే హోమ్ లో బోలెడు కళాఖండాలుంటాయ్
  • రియల్ ఎస్టేట్ గురుతో నటుడు పంకజ్ త్రిపాఠి

ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత పంకజ్ త్రిపాఠి హాలిడే హోమ్ చూస్తే.. పునాది నుంచి పైకప్పు వరకు విభిన్నమైన కమ్యూనిటీలకు సంబంధించిన అంశాలు మిళితమై ఉన్న విషయాన్ని గుర్తిస్తాం. హస్తకళల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. తన హాలిడే హోమ్ లో ఉన్న పలు వస్తువులు, కళాఖండాల గురించి పంకజ్ బోలెడు సంగతులు పంచుకున్నారు. ‘నేను పశ్చిమ బెంగాల్ నుంచి అద్భుతమైన కళఖండాలు కొనుగోలు చేశాను.

అలాగే కజిరింగాలో కొన్న ఖడ్గమృగం బొమ్మ చూస్తే నేరుగా అడవి నుంచి వచ్చేసిందా అనిపిస్తుంది. నా వద్ద ఉన్న ఏనుగు సైతం అలాగే ఉంటుంది. ఇంతటి కళా నైపుణ్యం కనబరుస్తున్న అక్కడి గ్రామస్తులను అభినందిస్తున్నాను. కాళాత్మకత అనేది నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది. నా ఇంట్లో ఉన్న మరో ముఖ్యమైన వస్తువు నా డైనింగ్ టేబుల్. దానిపై మైసూర్ కళ ఉంటుంది. నా కుర్జీలు రోజ్ వుడ్, పనస చెక్క తో తయారుచేసినవి’ అని వివరించారు. మిమీ సినిమా ఫేమ్ పంకజ్ త్రిపాఠి ఇంట్లో చూసే వస్తువులన్నీ మనకు విచిత్రంగా అనిపిస్తాయి. అవన్నీ వృత్తిపరంగా ఆయన అనుభవంపై ఆధారపడి ఉన్నవే కావడం ఇక్కడి విశేషం.

‘మా హాలిడే హోమ్ పేరు రూప్ కథ. ఎందుకంటే మా హాలిడే హోమ్ మన పాతకాలపు కథలతో స్పూర్తి పొందిందని భావిస్తాం. ఇది మన పురాతన సంస్కృతిని సజీవంగా ఉంచుతుంది. ముంబై వంటి నగరంలో ఈ ఇంటిని కొన్నప్పటికీ ఇది మాకు ఓ చిన్న పట్టణంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. సహజమైన రాతి ముఖభాగాలు, అసమాన కిటికీలు నాకు కొత్త విషయాలు కాదు.. కానీ సందర్శకులకు ఇవి కొత్తగా అనిపించవచ్చు.

మా గ్రామంలోని చారిత్రక నిర్మాణాల నుంచి ప్రతి అంశాన్నీ తీసుకోవడానికి ప్ర్రయత్నించాను’ అని పంకజ్ చెప్పారు. ఆయనకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అందుకే తన హాలిడే హోమ్ ను పచ్చని చెట్ల మధ్య నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగినట్టుగా చాలా మొక్కలను సైతం నాటారు. పనస వంటి మొక్కలు కూడా అందులో ఉన్నాయి. ఇవన్నీ 1970 నాటి అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాకుండా పక్షుల కిలకిలారావాలు సైతం మనల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి.

This website uses cookies.