రియల్ రంగంలో మరింత పారదర్శకత పెంపొందించేందుకు, వేగవంతంగా అనుమతులు ఇచ్చేందుకు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్, 2016తోపాటు టీఎస్ రెరా పోర్టల్ కు సవరణలు చేయాలని రియల్టర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. హైదరాబాద్ లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్ఏఆర్) నిర్వహించిన రెరా కాన్‌క్లేవ్‌లో తెలంగాణ నరెడ్కో చైర్మన్ సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రెరాలో రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులకు విధిస్తున్న 10 శాతం జరిమానాను 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి విన్నవించారు.
ప్రభుత్వ సంస్థలు కూడా వేగవంతంగా అనుమతులు ఇచ్చేలా చేయాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావాలని సూచించారు. ఒకవేళ ఏదైనా ప్రాజెక్టు మధ్యలో క్లెయిమ్స్ వస్తే టైటల్ గ్యారెంటీ ఆ ప్రాజెక్టుక రక్షణగా ఉంటుందన్నారు. ఇది అటు కొనుగోలుదారుల్లోనూ, ఇటు డెవలపర్లలోనూ పూర్తి విశ్వాసం కల్పిస్తుందని పేర్కొన్నారు. రెరా తెలంగాణ పోర్టల్ డ్యాష్ బోర్డును మార్చాలని రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ఎండీ నందకిషోర్ కోరారు. ఆ డ్యాష్ బోర్డు లో డెవలపర్లు, ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచాలని , దానివల్ల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం కొనుగోలుదారులకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుల పర్యవేక్షణకు కూడా ఇది ఉపకరిస్తుందన్నారు.
This website uses cookies.