* నిషేధిత జాబితాలోకి పాత గేటెడ్
కమ్యూనిటీల్లోని కొన్ని బ్లాకులు
* తలపట్టుకుంటున్న గృహయజమానులు
* పదిహేనేళ్ల క్రితమే కొంటే.. ఈ కొత్త తలనొప్పులేంటి?
* నాలా కన్వర్షన్.. నయా కష్టాలు..
* మిస్సింగ్ సర్వే నెంబర్ల కోసం వెతుకులాట
* వాటిని సీఎం కేసీఆర్ వెతికివ్వాలని సూచన
రైతులతో ఆట ఆటాడుకుంటున్న ధరణి పోర్టల్ గృహయజమానుల్ని వదిలిపెట్టడం లేదు. ప్రత్యక్ష నరకాన్ని చూపెడుతోంది. దీంతో, ఏం చేయాలో అర్థం కాక.. ఎవర్ని సంప్రదించాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు నాలా కన్వర్షన్ సకాలంలో జరగక డెవలపర్లూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా, కొత్త నిర్మాణాల్ని ఆరంభించేందుకు కష్టపడుతున్నారు. కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతున్నదని వాపోతున్నారు. మిస్సింగ్ సర్వే నెంబర్ల వ్యవహారం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వీటిని వెతకడంలో అధికారులు ఎలాగూ విఫలం అవుతున్నారు. కాబట్టి, సీఎం కేసీఆరే ఇలాంటి మిస్సింగ్ సర్వే నెంబర్లను వెతికి పెట్టాలని ప్రజలు విన్నవిస్తున్నారు.
* మియాపూర్‌లో పదహారేళ్ల క్రితం ఆరంభమైన ప్రాజెక్టులో ఫ్లాటు కొన్నాడో డాక్టర్. పన్నెండేళ్ల నుంచి అందులో నివసిస్తున్నాడు. కోకాపేట్ చేరువలో కొత్త ఫ్లాటులోకి షిఫ్టు అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడున్న ఫ్లాటు అమ్మకానికి పెట్టాడు. వారం రోజుల్లో అడ్వాన్సు తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా.. ఆ ఫ్లాటు సర్వే నెంబరును నిషేధిత జాబితాలో చేర్చడంతో కంగుతిన్నాడు. వృత్తిపరంగా తాను డాక్టరు కావడంతో ప్రతి అంశాన్ని పక్కాగా చూశాకే ఆ ఫ్లాటును కొనుగోలు చేశాడు. అయినా, అప్పుడు రాని సమస్య ఇప్పుడెలా వచ్చింది? తమ సర్వే నెంబరును నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చాల్సి వచ్చింది? అంటూ తల పట్టుకున్నాడు. దశాబ్దం క్రితమే బిల్డర్ ఫ్లాటును విక్రయించేశాడు. స్థలయజమాని ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడీ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవర్ని సంప్రదించాలో తెలియక లాయర్ వద్దకు బయల్దేరాడా డాక్టర్.
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రీతిలో పటాన్ చెరు చేరువలోని సుల్తాన్ పూరలో ప్లాస్టిక్ పార్కుకు శ్రీకారం చుట్టింది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కడ్లేని డిమాండ్ పెరిగింది. దీంతో, ఆయా ప్రాంతానికి చేరువలో అపార్టుమెంటును కడదామని నిర్ణయించుకున్నాడో డెవలపర్. రైతు వద్ద స్థలం కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సు చెల్లించాడు. నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వారం రోజుల్లో పని పూర్తవుతుందని అనుకుంటే.. ఆరు నెలలు దాటినా ఇంకా పని పూర్తి కాలేదు. నేటికీ ఆయా సంస్థ సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
* నాగార్జున రెడ్డికి నల్గొండలో నలభై ఎకరాలుంది. ఇందుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. కొత్త పాస్ పుస్తకంలో కేవలం 26 ఎకరాల్ని మాత్రమే నమోదు చేశారు. ఎందుకిలా చేశారంటే.. ఆ సర్వే నెంబర్లు మిస్ అయ్యాయని అంటున్నారు. మరి, ఆ సర్వే నెంబరు ఎందుకు మిస్ అయ్యిందో.. ఎలా మిస్ అయ్యిందో ఎవ్వరికీ తెలియదు. మిస్సింగ్ సర్వే నెంబరును కరెక్షన్ చేసే విధానం అక్కడ లేదు. దీనికి సంబంధించిన ప్రాసెస్‌ను ఎమ్మార్వోను అడిగితే.. అది తమ పరిధికాదని, కలెక్టర్‌ని సంప్రదించమంటున్నారు.
ఆయన వద్దకెళ్లి ఫిర్యాదు చేస్తే ఆన్‌లైన్‌లో ఆప్షన్ పెట్టుకోమంటున్నారు. ఏడాది అయినా, ఇంతవరకూ మిస్సింగ్ సర్వే నెంబర్ల గురించి ఎలాంటి సమాచారం లేదు. అవి ఎక్కడున్నాయో సంబంధిత స్థల యజమానులే వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కావట్లేదు.
ధరణి పోర్టల్ వల్ల రైతులే కాదు గృహయజమానులు, డెవలపర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పది, పదిహేనేళ్ల క్రితం నగరంలో ఆరంభమైన పలు బడా గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో, ఆయా బ్లాకుల్లో ఫ్లాటను అమ్ముకోలేక ఇంటి యజమానులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్నీ పక్కాగా ఉంటేనే బడా గేటెడ్ కట్టడాలకు స్థానిక సంస్థలు అనుమతిని మంజూరు చేస్తాయి. ఇప్పుడీ నిర్మాణాల్లో కొన్ని బ్లాకులను నిషేధిత సర్వే నెంబర్లు లేదా మిస్పింగ్ సర్వే నెంబర్లలో చేర్చడమేమిటని గృహ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ, ఆ సర్వే నెంబరులో సమస్య ఉంటే, అపార్టుమెంట్లకు అనుమతిని ఎలా మంజూరు చేశారు? అప్పుడే అనుమతిని మంజూరు చేయకపోతే, తాము కొనేవాళ్లం కాదు కదా అని నిలదీస్తున్నారు. ఒకవేళ, అధికారులు మరియు సిబ్బంది పొరపాటున ఇలాంటి పని చేసి ఉంటే, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని.. పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.