Categories: TOP STORIES

పంచాయతీ ప్లాట్లను రిజిస్టర్ చేయాలి!

  • తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్లకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ వినతి పత్రాల్ని అందజేసింది. పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలంగాణ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్స్ ఐజీ.. 2020 ఆగస్టు 26న మెమో జారీ చేశారు. దీంతో, కొంతమంది రియల్టర్లు హైకోర్టుకు ఫిర్యాదు చేయగా సానుకూల తీర్పునిచ్చింది.

ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీంతో, కేసు పెండింగులో ఉంది. ఈ కేసు ఇలా ఉండగా.. తెలంగాణలోని రియల్టర్స్ అసోసియేషన్ ఉద్యమ బాట పట్టింది. అంతకంటే రెండు రోజుల ముందు సంఘం భారీ ఎత్తున స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐజీకి వినతి పత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీ ప్లాట్లను తెలిసో తెలియకో కొనుగోలు చేసిన ప్రజలు మానసిక వేదనను అనుభవిస్తున్నారని.. అందుకే, తక్షణమే పంచాయతీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరారు.

గ్రామ పంచాయతీ లేఔట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత కారణంగా పలువురు రియల్టర్లు అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఔట్లలో కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ అవసరాలకు ప్లాట్లు అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 29వ తేదీన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులకు వినతి పత్రాలు సమర్పించాలని డిసెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టనున్నట్లు నరసయ్య వెల్లడించారు.

This website uses cookies.