Categories: TOP STORIES

చింతామణిని మించిన తెలంగాణ ధరణి

  • ప్రజల కష్టం తీరేదెలా?

తెలంగాణ రాష్ట్రంలో ధరణి చేసిన మాయ అంతాఇంతా కాదు.. భూమి లేనివాడిని భూయజమానిని చేసింది. భూ యజమాని భూమి లేనివాడయ్యాడు. పట్టా ఉన్నవారు అమ్ముకోలేని దుస్థితి. భూమిపై హక్కే లేని వ్యక్తికి భూమిలిచ్చింది. కొనేవాడికేమో రాచబాట పరిచింది. సమస్యలుంటే కంప్యూటరుకు చెప్పుకోమంది. ఏమైనా తప్పులుంటే కోర్టుకు పొమ్మంది.

కంప్యూటర్లు భూపరిపాలన చేయలేవనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. మెరుగైన భూ పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి. ఈ యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పక్కాగా ఉండాలి. అప్పుడే, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఏర్పడవు. కానీ, రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ధరణి పేరిట మొత్తం గోల్ మాల్ జరుగుతోంది. ఇది ఏ స్థాయిలో జరుగుతుందంటే.. ధరణి పనుల్ని చేపట్టే కంప్యూటర్ ఆపరేటర్లు సైతం కోటీశ్వరులయ్యారు.

రెవెన్యూ అధికారులు రోడ్డున పడ్డారు.. రైతులు కంప్యూటర్లకు కాగితాలకు మధ్య నలిగి పోతున్నారు. తెలంగాణాలో భూపరిపాలన, భూసమస్యల పరిష్కారం చేసే అధికారులు గ్రామాల్లో లేరు.. విఆర్వోలను తొలగించడం.. వీఆర్ఏలు ఆందోళనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. మండలాధికారిని రిజిస్ట్రారుగా చేసి కంప్యూటర్ కి కట్టేశారు. డివిజనల్ అధికారి ఉన్నా.. లేనట్లే. అన్ని అధికారాలు జిల్లా అధికారికి ఇచ్చి కంప్యూటర్ పక్కన కూర్చోబెట్టేశారు. నేటికీ రాష్ట్ర స్థాయి అధికారి లేరు.. కంప్యూటర్ ఆపరేటరే సర్వాధికారి అయ్యాడు. ఇలాగైతే రైతుల కష్టం తీరేదెలా?

This website uses cookies.