Categories: TOP STORIES

హైద‌రాబాద్‌లో కొత్త‌ ఆకాశ‌హ‌ర్మ్యాల‌ అనుమ‌తి క‌ష్ట‌మేనా?

ఎన్నిక‌ల నేప‌థ్యంలో పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రియ‌ల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అడ్డ‌దిడ్డంగా ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తుల్ని మంజూరు చేసింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడిక ఆయ‌నే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు కాబ‌ట్టి.. కొత్త ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తినిస్తారా? లేదా? అనే సందేహం హైద‌రాబాద్ బిల్డ‌ర్ల‌లో నెల‌కొంది.

కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లేమో హైద‌రాబాద్‌లో స్కై స్క్రేప‌ర్ల‌కు ప‌ర్మిష‌న్ త‌గ్గిస్తార‌ని అంటుండ‌గా.. మ‌రికొంద‌రేమో అలాంటిదేం ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాక‌పోతే, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం త‌ర‌హాలో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌.. మౌలిక స‌దుపాయాల్లేని మియాపూర్ వంటి ప్రాంతంలో.. కొత్త స్కై స్క్రేప‌ర్ల‌కు అనుమ‌తిని మంజూరు చేయ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఎందుకంటే, గ‌త ప్ర‌భుత్వంలో మియాపూర్ నుంచి బాచుప‌ల్లి రోడ్డులో.. ప్ర‌స్తుత‌మున్న ఎన‌భై అడుగుల రోడ్డుకే క్యాండియ‌ర్ 40, క్యాండియ‌ర్ ట్విన్స్‌, టీమ్ ఫోర్ స్పేసెస్ నైలా, ప్రైమార్క్ ఇన్‌స్పిరా వంటి ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తినిచ్చారు. అంటే, భ‌విష్య‌త్తులో అది రెండు వంద‌ల అడుగుల రోడ్డ‌గా వెడ‌ల్పు చేస్తారు కాబ‌ట్టి.. ఆ మెయిన్ రోడ్డుకు సుమారు ఆరు నుంచి ఏడు ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తినిచ్చారు. అంటే, కేవ‌లం అర‌కిలోమీట‌ర్ వ్య‌వ‌ధిలోనే సుమారు ఐదు వేల ఫ్లాట్ల నిర్మాణం అక్క‌డ జ‌రుగుతోంది. ఫ‌లితంగా, ఇప్పుడే అక్క‌డ ట్రాఫిక్ జామ్ స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. పాదాచారులు రోడ్డు దాట‌లేక‌పోతున్నారు. ఇక చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్ధులైతే ట్రాఫిక్ ఉన్న స‌మ‌యాల్లో ఈ రోడ్డు మీదికి వెళ్ల‌డానికీ సాహ‌సం చేయ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితులు హైద‌రాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నెల‌కొంది. అందుకే, హైద‌రాబాద్‌లో ఇక నుంచి కొత్త ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తిని క‌ట్టుదిట్టం చేస్తార‌నే అభిప్రాయం రియ‌ల్ రంగంలో స‌ర్వ‌త్రా నెల‌కొంది.

This website uses cookies.