తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పు జరిగింది. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అలాగనీ, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. వారంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. నగరంలో ఏర్పాటైన సరికొత్త ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, అండర్ పాస్‌లు, మెరిసిపోయే రహదారులు, కొత్తగా ఏర్పాటైన ఐటీ, ఫార్మా వంటి కంపెనీలు, మెరుగైన శాంతిభద్రతలు, స్వచ్ఛ హైదరాబాద్.. ఇలాంటివన్నీ నగరవాసుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే, ప్రజలు నగరంలో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయినప్పటికీ, గ్రామీణ తెలంగాణ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రియల్ రంగం కోరుతున్నదేమిటి? ఏయే అంశాలపై కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది?
నిన్నటివరకూ బీఆర్ఎస్ పాలనలో మాస్టర్ ప్లాన్ తో సంబంధం లేకుండా.. ఎక్కడపడితే అక్కడ ఆకాశహర్మ్యాలకు అనుమతినిచ్చారు. చెరువుల పక్కన హైరైజ్ భవనాల్ని కట్టుకునేందుకు అంగీకరించారు. అలా కాకుండా, ఆకాశహర్మ్యాల్ని కొన్ని నిర్దిష్ఠమైన ప్రాంతాల్లోనే అనుమతిస్తే మేలని అధిక శాతం మంది డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే, అధిక బిల్టప్ ఏరియా రావడం వల్ల ఆయా ప్రాంతాల్లో స్థలాల రేట్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ ను ఓ అంతర్జాతీయ నగరంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలి.
హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇప్పటికే పెండింగులో ఉన్న రహదారుల్ని అభివృద్ధి చేయాలి. నగరంలో కొత్తగా యాభైకి పైగా లింక్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు హెచ్ఆర్‌డీసీఎల్ గతేడాది ప్రతిపాదించింది. వీటిని పూర్తి చేయడంపై దృష్టి సారించాలి.
నిన్నటివరకూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేది. అదే విధానాన్ని కొనసాగిస్తూ.. పారిశుద్ధ్య నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటించేలా వినూత్న నిర్ణయాల్ని తీసుకోవాలి. నలగండ్లలో డంపింగ్ యార్డు వల్ల అక్కడి గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఆధునీకరించాలి. కేంద్రం ప్రతిపాదించిన ఘన వ్యర్థాల నిబంధనలకు అనుగుణంగా ఆధునిక డంపింగ్ యార్డులను సిద్ధం చేయాలి.
టీఎస్ బీపాస్ ద్వారా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. కాకపోతే, ఈ విధానంలో ఇంకా మనుష్యుల ప్రమేయం లేకుండా అనుమతి మంజూరు కావట్లేదు. పైగా, ప్రతి దశలోనూ అధికారులకు ఆమ్యామ్యాలు అందించనిదే అనుమతి చేతికి రావట్లేదు. ఇక ఎన్వోసీల విడుదలలో ఎక్కడ్లేని జాప్యం జరుగుతోంది. స్థానిక సంస్థల అధికారులు, సిబ్బంది అయితే.. ఎన్వోసీకి సంబంధించి చిన్న బిల్డర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని కొత్త ప్రభుత్వం అధిగమించేందుకు తగిన నిర్ణయాల్ని తీసుకోవాలి.
బీఆర్ఎస్ పెద్దలు రెరా అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇటీవల కాలంలో రెరాకు ఛైర్మన్‌ను నియమించినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఈ విభాగం పని చేయని దుస్థితి నెలకొంది. బడా బిల్డర్లు ప్రీలాంచుల్లో ప్రాజక్టుల్ని అమ్మినా వారిని ఏం చేయలేని పరిస్థితి. కారణంగా, ఆయా బిల్డర్లు ప్రభుత్వ పెద్దలకు చేరువగా ఉండటమే ప్రధాన కారణం. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే డెవలపర్లకు తప్పనిసరిగా శిక్షను విధించాలి. అప్పుడే నిర్మాణ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. లేకపోతే, రెరా అంటే ఎవరూ పెద్దగా భయపడే అవకాశముండదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకత ఏమిటంటే.. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణలో పెట్టుబడుల్ని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల్ని.. మాజీ మంత్రి కేటీఆర్ అనర్గళంగా వివరించేవారు. ఆయన చొరవచూపడం వల్లే అనేక సంస్థలు తెలంగాణలోకి అడుగుపెట్టాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి.. కొత్త సంస్థల్ని విశేషంగా ఆకర్షించాలి. పలు కంపెనీలు వచ్చి కొత్తగా పెట్టుబడుల్ని పెట్టేలా ప్రోత్సహించాలి. మూడు నుంచి ఆరు నెలల్లోపు కొత్త కంపెనీలను కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఆకర్షించగలిగితే.. ఇన్వెస్టర్లకు ఎక్కడ్లేని నమ్మకం ఏర్పడుతుంది.
కాంగ్రెస్ వస్తే రియాల్టీ పడిపోతుందనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో కొత్త సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ రంగాన్ని మరింత డెవలప్ చేస్తానని ఆయన స్వయంగా చెప్పారు. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం అడుగులు వేయాలి.
ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలకు అనుమతినివ్వడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. నగరమంతా కాంక్రీటు జంగిల్లా మారుతోంది. అలా కాకుండా. కొన్ని నిర్దిష్ఠమైన ప్రాంతాల్లోనే అపార్టుమెంట్లు, ఆకాశహర్మ్యాలు, విల్లా ప్రాజెక్టులకు అనుమతినివ్వాలి. మిగతా ఏరియాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. కొత్త నిర్మాణాలు కట్టే ప్రాంతం పక్కన నివసించే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి, ప్రజలు నివసించే ప్రాంతాల్లో అపార్టుమెంట్లను కట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని నిర్దిష్ఠమైన నిబంధనల్ని పురపాలక శాఖ రూపొందించాలి.
This website uses cookies.