కొవిడ్ మొదటి విడత పూర్తయ్యాక.. చాలామంది ప్లాట్లను కొనేందుకు ఎగబడ్డారు. ఆ జాబితాలో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి భానూరులో ఒక గ్రూపు వద్ద గతేడాది రూ.25,000 గజం చొప్పున 200 గజాల ప్లాట్లు కొన్నాడు. ఇక నుంచి రేటు పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తే ఉండదని భావించాడు. అయితే, ఇటీవల హఠాత్తుగా డబ్బు అవసరమై ఆయా ప్లాటును అమ్మకానికి పెడితే గజం రూ.22 వేల కంటే ఎక్కువ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఎందుకీ పరిస్థితి తలెత్తిందని మార్కెట్ ఎగ్జిక్యూటివ్‌ని సంప్రదిస్తే.. అతను ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రజల్లో ఒక రకమైన భయం ఏర్పడింది. అద్దె ఇల్లు లేదా ఫ్లాట్లలో నివసించడం కంటే సొంతంగా ఒక ఇల్లు కట్టుకుని నివసించాలని చాలామంది భావించారు. పైగా, రానున్న రోజుల్లో కొవిడ్ మరో రెండు వేవ్‌లు వస్తాయనే ప్రచారంలో అందరూ ప్లాట్ల కోసం పరుగులెత్తారు. ఎక్కడపడితే అక్కడ ఎందుకు కొంటున్నారో తెలియకుండా కొనేశారు. కొనుగోలుదారులు వస్తున్నారు కదా అని రియల్ సంస్థలూ ప్లాట్ల ధరల్ని ఒక్కసారి పది నుంచి ఇరవై శాతం పెంచేశాయి. అయితే, ఆ పెరుగుదల మార్కెట్ బూమ్ వల్ల వచ్చిందని బయ్యర్లు భావించారే తప్ప కృత్రిమంగా రియల్టర్లు రేట్లను పెంచారని అనుకోలేదు. అందుకే, కాస్తోకూస్తో రేటు తగ్గించుకుని ఎట్టకేలకు కొనుగోలు చేశారు. అదే సమయంలో ఇతర నగరాలు, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి భూములు కొనేవారి సంఖ్య పెరిగింది. ఫలితంగా, మార్కెట్లో బూమ్ నెలకొందని చాలామంది భావించారు. ఏమేతైనేం అటు ఎకరాల్లో భూముల ధరలు, ఇటు గజాల్లో ప్లాట్ల ధరలు పెరిగాయి. కోకాపేట్ వేలం తర్వాత మళ్లీ రేట్లు పెరిగిపోయాయి.