Categories: TOP STORIES

పెట్టుబడుల్లో రియల్ జోష్

  • 340 కోట్ల డాలర్లకు చేరిన మొత్తం
  • 67 శాతం విదేశీ పెట్టుబడులే

రియల్ రంగంలో పెట్టుబడుల ఊపు కొనసాగుతోంది. కోవిడ్ పరిస్థితులతో కాస్త ఒడుదొడుకులకు లోనైన రియల్ రంగం గాడిన పడుతోంది. ఈ క్రమంలోనే పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఈ రంగంలో పెట్టుబడులు 340 కోట్ల డాలర్లకు చేరాయి. ఇందులో 67 శాతానికి పైగా మొత్తం విదేశీ పెట్టుబడులే కావడం గమనార్హం. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేటు లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా మార్కెట్ మానిటర్-క్యూ2-2022’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

2021 ద్వితీయార్ధం కంటే 2022 ప్రథమార్ధంలో మూలధన ప్రవాహం 42 శాతం మేర పెరిగింది. 65 శాతం వాటాతో సంస్థాగత పెట్టుబడిదారులు అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు 31 శాతం వాటా కలిగిన డెవలపరల్లు గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులకే ప్రాధాన్య ఇస్తున్నట్టు తేలింది. మొత్తానికి 2022లో 70 శాతం పెట్టుబడులు పూర్తిగా పెట్టుబడి కోణం, వ్యాపార ప్రయోజనంతో ముడిపడి ఉండగా.. 30 శాతం అభివృద్ధి, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు సంబంధించినవి. ఇక పెట్టుబడుల్లో 57 శాతం వాటాతో ఆఫీస్ రంగం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

తర్వాత భూమి లేదా డెవలప్ మెంట్ సైట్లు 30 శాతం, రిటైల్ రంగం 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 67 శాతం విదేశీవి కాగా.. ఇందులోనూ 59 శాతం వాటా ఒక్క కెనడా నుంచే ఉండటం గమనార్హం. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి క్యూఐపీ, ఐపీఓ మార్గాల్లో ప్రముఖ డెవలపర్లు రూ.18,700 కోట్లు (240 కోట్ల డాలర్లు) సేకరించారని.. 2022లో ఇది మరింత కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని సీబీఆర్ఈ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ రెసిడెన్షియల్ బిజినెస్ ఎండీలు గౌరవ్ కుమార్, నిఖిల్ భాటియా అభిప్రాపడ్డారు. ఇక ఇళ్ల విక్రయాల్లోనూ వృద్ధి కనపడుతోందని సీబీఆర్ఈ తన నివేదికలో పేర్కొంది. వార్షిక వృద్ధి రేటును పరిశీలిస్తే.. 2022 రెండో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు ఏకంగా 121 శాతం పెరిగినట్టు తెలిపింది.

This website uses cookies.