నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల రేట్ల పెంపునకు నిర్ణయం
పెరుగుతున్న నిర్మాణ వ్యయం, తగ్గుతున్న లాభాలతో పాటు కొనుగోలుదారుల ఆకాంక్షలను అధిగమించడానికి హౌసింగ్ యూనిట్ల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని రియల్టర్లు భావిస్తున్నారు. దేశంలో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ వ్యయం 6 శాతం మేర పెరిగినట్టు జేఎల్ఎల్ నివేదిక తాజాగా వెల్లడించింది. ఈ విషయంలో అత్యంత వ్యయభరిత నగరంగా ముంబై నిలవగా.. సరసమైన నగరంగా చెన్నైకి స్థానం దక్కింది.
పర్యావరణసహిత, అధిక నాణ్యత కలిగిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా అప్పగించాలంటే నిర్మాణ వ్యయాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని జేఎల్ఎల్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ ఎండీ జిపు జోస్ జేమ్స్ పేర్కొన్నారు. పుణెకు చెందిన గోయెల్ గంగా డెవలప్ మెంట్స్ తన ప్రాపర్టీ ధరలను 5 నుంచి 7 శాతం మేర పెంచింది. తాము స్వల్పంగా ధరలు పెంచినప్పటికీ, కొనుగోలుదారులకు గరిష్టంగా ప్రయోజనాల కల్పిస్తామని ప్రకటించింది. కరోనా తర్వాత హౌసింగ్ డిమాండ్ మరీ బీభత్సంగా పెరగకపోయినా.. మన మార్కెట్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని గోయల్ గంగా డెవలప్ మెంట్స్ డైరెక్టర్ అనురాగ్ గోయెల్ చెప్పారు.