క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వాహకులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యాండిచ్చారు. హైటెక్స్‌లో శుక్రవారం జరిగే 13వ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి విచ్చేసేందుకు ఆయన తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దీంతో, క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రచారాన్నిభారీగానే నిర్వహించారు. సీఎం హోదాలో ముఖ్య అతిథిగా విచ్చేసే రేవంత్ రెడ్డి.. ఎలాంటి ప్రోత్సాహాకాల్ని ప్రకటిస్తారోనని యావత్ నిర్మాణ రంగం ఎంతో ఆశగా ఎదురు చూసింది.
* నగరానికి చెందిన బడా బడా బిల్డర్లంతా శుక్రవారం ఉదయం ప్రాపర్టీ షోకు విచ్చేశారు. కాకపోతే, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవానికి రాకపోవడంతో కొంత నీరసించి పోయారు. వాస్తవానికి, ఆయన రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లి ఉదయమే వచ్చారని అనధికార సమాచారం. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని కనుక్కుంటే.. గత శాసనసభ ఎన్నికల్లో క్రెడాయ్ హైదరాబాద్.. కేటీఆర్‌కు పూర్తి స్థాయి మద్ధతును ప్రకటించిన విషయాన్ని మనసులో పెట్టుకుని రాలేదేమోనని.. కొంతమంది డెవలపర్లు అనుమానం వ్యక్తం చేశారు.
* వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ నిర్మాణ రంగానికి వరాల జల్లులు కురిపించారు. అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వరాల వర్షం కురిపిస్తారేమోనని నిర్మాణ రంగమంతా ఆశగా ఎదురు చూసింది. కాకపోతే, ఆయన రాకపోవడంతో ఒకింత నిరాశే ఎదురైంది. ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.