ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని బాకారంలో.. అక్రమంగా నిర్మించిన ఇమాజిన్ హై ఎండ్ లగ్జరీ విల్లాలపై చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులు తాజాగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ‘ఇమాజిన్ హై ఎండ్ లగ్జరీ’ సంస్థకు (డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అనుబంధ సంస్థ) నోటీసులు జారీ చేయాలని టీఎస్ రెరా నిర్ణయించింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇమాజిన్ విల్లాల్ని నిర్మిస్తున్న డ్రీమ్ వ్యాలీ రిసార్టుకు నోటీసును జారీ చేయగా.. ఆ సంస్థ హేతుబద్ధమైన కారణాల్ని తెలియజేయడంలో విఫలమైంది. దీంతో, అనుమతుల్లేని విల్లాల్ని కూల్చివేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో మొయినాబాద్ తహసీల్దార్ కె.గౌతమ్‌కుమార్ కలెక్టర్‌కు, హెచ్‌ఎండిఏ సంస్థకు లేఖ రాశారు. రెండో విడతలో చేపట్టిన 14 విల్లాలను అనుమతులు లేవని, మొదటి విడతలో జరిగిన 19 విల్లాల నిర్మాణంలోనూ అదే జరిగిందని మొయినాబాద్ తహసీల్దార్ కె.గౌతమ్‌కుమార్ కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ విల్లాలను కూల్చివేయడానికి టాస్క్‌ఫోర్స్ బృందాలను, తగినంత సిబ్బందిని పంపించాలని హెచ్‌ఎండిఏకు కె.గౌతమ్‌కుమార్ లేఖ రాశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతంలోని బాకారంలో అక్రమంగా విల్లాల నిర్మాణం జరుగుతున్నప్పటికీ గత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో.. కొందరు పర్యావరణవేత్తలు, స్థానికులు వీటిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ విల్లాల నిర్మాణానికి సంబంధించి మొదట రెజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఒక్కో విల్లా రూ.25 కోట్లు..
ఈ సంస్థ ఒక్కో విల్లాను పదిహేను వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తుండగా.. ధర మాత్రం రూ.25 కోట్లుగా డ్రీమ్ వ్యాలీ సంస్థ నిర్ణయించింది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న డ్రీమ్ వ్యాలీ ఇమాజిన్ విల్లాలు ప్రకృతిని వినాశం చేస్తాయని పర్యావరణవేత్తలు కొంతకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే డ్రీమ్ వ్యాలీ సంస్థ ఎండీ సుమారు ముప్పయ్ వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బంగళా నిర్మించుకున్నారని సమాచారం. మరి, ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో ఇంతింత బడా సైజులో బంగళాల్ని నిర్మించుకుంటే.. వాటి నుంచి విడుదలయ్యే మురుగు నీరంతా జంట జలాశయాల్లోకి వెళుతుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే.. భవిష్యత్తులో జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్‌గా మారే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతికి వ్యతిరేకంగా నిబంధనలను తుంగలో తొక్కి.. గుట్టు చప్పుడు కాకుండా ఈ జంట జలాశయాలను (ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్) ఇమాజిన్ విల్లాస్ కాలుష్యరహితంగా మార్చుతుందని ఇటీవల కాలంలో పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో, వాటిని కూల్చివేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.
కంచర్ల కతర్నాక్ ప్లాన్..
డ్రీమ్ వ్యాలీ సంస్థ మొయినాబాద్ మండలం బాకారంలో నిర్మిస్తున్న ‘ఇమాజిన్ హై ఎండ్ లగ్జరీ’ విల్లాలు.. 10 నుంచి 15 ఎకరాల్లో జరుగుతున్నాయి. మొదటి ఫేజ్‌లో 13 విల్లాలను ఆ సంస్థ విక్రయించినట్టుగా అధికారులు గుర్తించారు. రెండో ఫేజ్‌లో 19 విల్లాలను నిర్మిస్తుండటం, మూడో విడతలో మరో 15 విల్లాలను నిర్మించేలా ఈ సంస్థ ప్రణాళికల్ని రచించిందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ముందుగా విక్రయించిన 13 విల్లాలను కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కూల్చివేస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విల్లాల్ని డ్రీమ్ వ్యాలీ సంస్థ కు చెందిన కంచర్ల సంతోష్‌రెడ్డి నిర్మిస్తున్నాడని తెలిపారు.
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని మొయినాబాద్ తహసీల్దార్ కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ విషయాన్ని విన్నవించామని తెలిపారు. తాము ఇచ్చిన నోటీసులకు ‘ఇమాజిన్ హై ఎండ్ లగ్జరీ’ సంస్థ ఇచ్చిన సమాధానం కరెక్ట్‌గా లేదని, అంతే కాకుండా ఆ సంస్థ ఎలాంటి అనుమతి లేకుండా ఈ విల్లాల్ని నిర్మిస్తున్న విషయాన్ని తాము గుర్తించామని తెలిపారు.
This website uses cookies.