హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా మారనున్నది. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంతో తెలంగాణలోని పలు జిల్లాల మీదుగా ఈ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తర, దక్షిణ భాగాలుగా ఈ ప్రాజెక్టును చేపడుతుండగా.. ఇప్పటికే ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. కాగా, ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించడంతో పాటు ఆర్ఆర్ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును సైతం చేపడితే ఒకే సమయంలో, త్వరితగతిన పనులు పూర్తవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనల్ని సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర రైల్వే శాఖను సమన్వయం చేసుకుని రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనల్ని ప్రధాని మోదీని స్వయంగా కలిసి నివేదించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డు, రీజినల్ రింగ్ రైలుతో తెలంగాణ రాష్ట్రం 60 శాతం పట్టణీకరణ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టూ 200 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి విస్తృతమవుతుందని అంచనా వేస్తున్నారు.
This website uses cookies.