Categories: LATEST UPDATES

ముంబైలో రిజిస్ట్రేషన్ల ర్యాలీ

తొమ్మిది నెలల్లో లక్ష దాటిన రిజిస్ట్రేషన్లు

దేశ ఆర్థిక రాజధాని ముంబై రియల్ ఎస్టేట్ రంగం దూకుడు కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు లక్ష మార్కు దాటాయి. దశాబ్ద కాలంలో ఇది అత్యంత వేగవంతం కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 12 శాతం పెరిగి లక్ష డీల్స్ దాటినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో ముంబై మున్సిపల్ ప్రాంతం 1,05,664 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసినట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 94,309 యూనిట్లు నమోదయ్యాయి. ప్రాపర్టీ విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఆదాయం 6 శాతం పెరుగుదలతో రూ.8,892 కోట్లకు చేరుకుంది.

సెప్టెంబర్ లో రెసిడెన్షియల్ యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 80 శాతం ఉన్నాయి. అలాగే రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్లలో 23 శాతం ఉన్నాయి, సెప్టెంబర్ 2023లో ఇది 18 శాతంగా ఉంది. రూ.50 లక్షల లోపు ఆస్తుల వాటా 28 శాతం నుంచి 17 శాతానికి పడిపోయింది. విస్తీర్ణపరంగా చూస్తే.. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో 500-1,000 చదరపు అడుగుల మధ్య అపార్ట్ మెంట్లు 52 శాతం ఉన్నాయి. 1,000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అపార్ట్ మెంట్ల వాటా 2023లో 19 శాతం ఉండగా.. 2024లో 22 శాతానికి పెరిగింది.

This website uses cookies.