- నాలుగు సంస్థలకు రూ.4 కోట్ల జరిమానా
రిజిస్టర్ చేయని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి అక్రమంగా వాణిజ్య ప్రకటనలు ఇస్తున్న నాలుగు సంస్థలపై హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (హెచ్-రెరా) కన్నెర్ర చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని మూడు సంస్థలకు రూ.4 కోట్ల జరిమానా విధించింది. సెక్టార్ 89లోని సిటీ ఆఫ్ డ్రీమ్స్ ప్రాజెక్టుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇచ్చినందుకు ఎం3ఎం ప్రైవేటు లిమిటెడ్ కు రూ.2.5 కోట్ల జరిమానా వేసినట్టు హెచ్-రెరా చైర్మన్ కేకే ఖండేల్ వాలా తెలిపారు. అలాగే సెక్టార్ 61లో ఉన్న స్మార్ట్ వరల్డ్ ప్లోర్స్ కు రూ.50 లక్షల జరిమానా విధించినట్టు చెప్పారు. వీటితోపాటు స్మార్ట్ వరల్డ్ ప్రాజెక్టులో భాగస్వామ్యులుగా ఉన్న స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్, సుపోషా రియల్ కన్ సంస్థలపై చెరో రూ.50 లక్షల జరిమానా వేసినట్టు వివరించారు. రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే ప్రాజెక్టులకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడం ఇటీవల బాగా ఎక్కువైపోయిందని ఖండేల్ వాలా పేర్కొన్నారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నేరుగా లేక ఏజెంట్ల ద్వారా రిజిస్టర్ కాని ప్రాజెక్టులకు సంబంధించి ప్రకటనలు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. 2017 మే ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన రెరా చట్టం ప్రకారం.. ప్లాట్ అయినా, అపార్ట్ మెంట్ అయినా, వ్యక్తిగత నివాసమైనా.. మార్కెటింగ్ చేయాలన్నా, అమ్మాలన్నా, వాణిజ్య ప్రకటన ఇవ్వాలన్నా వాటిని రెరా వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులకు పాల్పడే బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నాలుగు సంస్థలను పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని.. అందువల్లే జరిమానా విధించామని పేర్కొన్నారు.