(రెజ్ న్యూస్, హైదరాబాద్):హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే హెచ్ఎండీఏ.. రెరా అథారిటీ.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాలకు పూర్తి స్థాయి కమిషనర్లు లేనే లేరు. ప్రస్తుతం ఉన్నవారూ అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా, ఆయా విభాగాలపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టే అవకాశం లేకుండా పోతుంది.పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ ను పర్యవేక్షిస్తున్నారు. గతంలో కమిషనర్ చిరంజీవులును బదిలీ చేశాక జనార్దన్ రెడ్డికి ఆ పోస్టునిచ్చారు. ఏ ఫైలు మీద సంతకం పెట్టనని అన్నారో తెలియదు కానీ ఆయన్ని అవమానకర రీతిలో ఆ పోస్టు నుంచి తొలగించి ఆ బాధ్యతను అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌కి కట్టబెట్టారు. రాజేశ్వర్ తివారీ పదవీవిరమణ చేశాక రెరా అదనపు బాధ్యతల్ని అప్పటి ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్‌కి అందజేశారు. కాలక్రమంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడంతో రెరాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేదు. దీంతో, తెలంగాణ రాష్ట్రంలో ప్రీ లాంచ్ పథకాలు, యూడీస్ అమ్మకాలు యధేచ్చగా జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారుల సమస్యల్ని పట్టించుకునే నాథుడే రాష్ట్రంలో కరువయ్యారు. ప్రజలు రెరా కార్యాలయానికి విచ్చేసి సమస్యలు చెప్పుకుంటున్నా వాటిని పరిష్కరించడంలో విఫలం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నిండటంలో ముఖ్యభూమిక పోషించే స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్‌కి ప్రస్తుతం శేషాద్రి అదనపు బాధ్యతల్ని చేపట్టారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే ఈ మూడు విభాగాలకు సంబంధించిన సమీక్షల్లేవు.. వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రణాళికల్లేవు.
అనుమతులు ఎన్ని రోజులు?
తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ కి సంబంధించిన ముఖ్య విభాగాలకే ప్రధాన అధికారులు లేకపోవడం అతిపెద్ద లోపంగా అభివర్ణించొచ్చు. దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోగా.. అభివృద్ధి పనుల్ని చేపట్టడంలో వెనకడుగు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. హెచ్ఎండీఏ విభాగంలో మాస్టర్ ప్లాన్లకు సంబంధించిన ఊసే లేదు. పాత మాస్టర్ ప్లాన్ గడువు ముగిసింది. కొత్త మాస్టర్ ప్లాన్ ఖరారు కాలేదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ఏడేళ్లయినా ఇంకా పూర్తి కాలేదు. ఒక్కో అపార్టుమెంట్ అనుమతి 21 రోజులు కాదు కదా.. ఐదారు నెలలు పడుతుంది. మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పిన మాటల్ని హెచ్ఎండీఏ విభాగం అధికారులే పట్టించుకోవట్లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.