భారత్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2022 నుంచి 2024 వరకు మూడేళ్లలో ఏకంగా రూ.2.29 లక్షల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో దాదాపు పావు శాతం.. అంటే రూ.57,600 కోట్లు ఒక్క ముంబైకే వచ్చాయి. ఈ వివరాలను సీఐఐ-సీబీఆర్‌ఈ సంయుక్త నివేదిక వెల్లడించింది. ముంబైతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు ఈ మూడు మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులు 16.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది.
మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోకి 2022-24 మధ్య వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతాన్ని ఈ మూడు నగరాలు దక్కించుకున్నాయి. గత మూడేళ్లలో 10 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులు (3 బిలియన్ డాలర్లు) టైర్-2 పట్టణ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చినట్టు తెలిపింది. భారత రియల్ ఎస్టేట్ రంగం కొత్త వృద్ధి పథంలోకి అడుగు పెట్టిందని.. బలమైన మూలధన పెట్టుబడులు, అభివృద్ధికి భూముల లభ్యత ఇందుకు మద్దతునిస్తున్నాయని సీబీఆర్‌ఈ భారత చైర్మన్, సీఈవో అంశుమన్ మ్యాగజీన్ తెలిపారు.